Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) నూతన జాతీయ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ల మధ్య సోమవారం కీలక సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని MCRHRD ప్రాంగణంలో సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలపై లోతుగా చర్చించారు. ఇటీవల ఎఐపీసీ బాధ్యతలు స్వీకరించిన మధుయాష్కీకి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ అప్పులు.. సంక్షేమ పథకాలు
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ.8 లక్షల కోట్ల అప్పులు, వాటి వల్ల పడుతున్న భారీ వడ్డీ భారాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఎంతటి ఆర్థిక ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలును నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని, అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అంశంపై ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వచ్చారు.
AIPC బలోపేతం.. భవిష్యత్ దిశ
రాష్ట్రంలో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పాత్రను మరింత క్రియాశీలకం చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రొఫెషనల్స్‌ను భాగస్వామ్యం చేస్తూ పార్టీ, ప్రభుత్వ ఆలోచనలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ పాలనను మరింత మందికి చేరువ చేయడం సహా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు పక్కా రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకుంది.
Also Read: నవంబర్ లోగా కాఫర్ డ్యామ్ కట్టాల్సిందే.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచుతాం: కవిత