Seethakka: స్వేచ్ఛ బ్యూరో: నవంబర్ 1 నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఎల్నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్ జీ పథకం అమలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, శాశ్వత గ్రామీణ ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
డీఆర్డీఓలపై సీతక్క ఆగ్రహం
వీబీ-జీ రామ్ జీ పథకం కింద అనుమతించిన 370 రకాల పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అన్ని పనులను ఒకేసారి చేపట్టకుండా, ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి లభించేలా ఎనిమిది నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచని డీఆర్డీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతి కనిపించాలని, కేవలం సమాధానాలు చెప్పి తప్పించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. అర్హులైన వారికి జాబ్ కార్డులు జారీ చేయడంలో జాప్యం చేస్తే ఎంపీడీవోలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 30వ తేదీ నాటికి మండలస్థాయి సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో పనుల ప్రణాళికలను పూర్తి చేయాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కార్యాచరణ ప్రణాళికను సమీక్షించి, తదుపరి పనులను గుర్తించాలని సూచించారు.
అధికారులకు ఆదేశాలు..
పథకంలో అనుమతించిన 370 రకాల పనులను ఒకేసారి చేపట్టకుండా, స్థానిక అవసరాలు, వాతావరణ పరిస్థితులు, కూలీల లభ్యత ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో విభజించాలన్నారు. గుర్తించిన 318 రకాల పనుల్లో గ్రామాల అవసరాలకు అనుగుణంగా కనీసం 50 రకాల ముఖ్యమైన పనులకు ప్రాధాన్యతనిచ్చి, నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. సీజన్లు, నెలలు, ప్రాంతాల వారీగా పనులను, పని దినాలను విభజించి పక్కా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఉపాధి హామీ పనులు కేవలం తాత్కాలిక ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా, గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే శాశ్వత ఆస్తుల నిర్మాణానికి దోహదపడాలని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పన, నీటి భద్రత అనే మూడు అంశాలను సమన్వయం చేసుకొని పనులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల ఎంపిక, ప్రణాళిక, అమలులో సర్పంచులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేస్తూ కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు.
గిరిజనుల జాబ్ కార్డుల విషయంలో తీవ్ర ఆగ్రహం..
గ్రామసభలు, స్థానిక అవసరాల ఆధారంగా పనులను గుర్తించి, మండల సమన్వయ కమిటీల ద్వారా వాటికి ప్రాధాన్యత కేటాయించాలని సూచించారు.గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధి పనులను మరింత విస్తరించాలని సూచించారు. అర్హులైన ఆదివాసి, గిరిజనులు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే, జాబ్ కార్డు మంజూరు చేయాలని, కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేశారు. అర్హులైన గిరిజనుల జాబ్ కార్డు దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించినా, జారీ చేయడంలో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రణాళికలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలై, గ్రామాలకు ఉపయోగపడే ఫలితాలు కనిపించాలని ఆమె ఆదేశించారు.ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, ఇంజినీర్-ఇన్-చీఫ్లు కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్, వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓలు, ఈఈలు, డీఈలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Also Read: కృష్ణానదిలో ఘోర ప్రమాదం.. నాటుపడవ మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం!