Cyber Crime: సడెన్‌గా ఫోన్‌కి ఓ మెసేజ్ రావడం.. వెంటనే బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఒకరు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ అవుతుందని భయపెట్టడం వంటి సైబర్ నేరగాళ్ల బెదిరింపులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఆ టెన్షన్ లో అవతలి వ్యక్తి ఏది చెబితే అది చేసేసి, చివరకు అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్న వాళ్లను మనం రోజూ చూస్తూనే ఉంటాం. కొద్ది సేపటి తర్వాత మోసపోయామని తెలిసినా, బ్యాంకు వాళ్లకు చెప్తే మన తప్పేనని డబ్బులు ఇవ్వరని చాలామంది సైలెంట్ అయిపోతుంటారు. కానీ, ఇక్కడే మనకు కొన్ని చట్టపరమైన హక్కులు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు.
సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందిలా నటిస్తూ.. కార్డు బ్లాక్ అవుతుందని లేదా అకౌంట్ నిలిచిపోతుందని భయపెడతారు. ఓటీపీలు చెప్పాలని, అనుమానాస్పద యాప్స్ డౌన్‌లోడ్ చేయాలని ఒత్తిడి చేస్తారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా, అధికారిక బ్యాంకు నంబర్‌కు కాల్ చేసి నిర్ధారించుకోవాలి.
Also Read: ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!
అనధికారిక లావాదేవీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలు కీలకం. కొన్ని సందర్భాల్లో బ్యాంకు నిర్లక్ష్యం లేదా మూడో పక్షం కారణంగా మోసం జరిగి, కస్టమర్ బాధ్యత లేకపోతే జీరో లయబిలిటీ వర్తించవచ్చు. అయితే, కస్టమర్ నిర్లక్ష్యం ఉన్నప్పుడు నష్టానికి బాధ్యత మారవచ్చు. కాబట్టి ప్రతి కేసులోనూ డబ్బు తిరిగి వస్తుందని భావించకూడదు.
అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్లు గుర్తించిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. వీలైనంత త్వరగా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. లావాదేవీల వివరాలు, మెసేజ్‌లు, స్క్రీన్‌షాట్‌లు, ఫిర్యాదు నంబర్‌ను భద్రపరచుకోవాలి. ఆలస్యం చేయకుండా స్పందించడం డబ్బు నిలిపివేతకు లేదా తిరిగి పొందే అవకాశాలకు సహాయపడుతుంది.
బ్యాంకు ఫిర్యాదుపై సరైన స్పందన ఇవ్వకపోతే.. ముందుగా బ్యాంకు ఉన్నత స్థాయి ఫిర్యాదు వ్యవస్థను ఆశ్రయించండి. అర్హత ఉన్న సందర్భాల్లో ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా, ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకండి. మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీ డబ్బును కాపాడే మొదటి అడుగు అనే విషయాన్ని మర్చిపోవద్దు.
Also Read: iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!