E-Paper
Advertisement

కరువును ఎదిరించి.. ఎండిన పొలాలను తడిపి.. చిన్నమాధారం అన్నదాతల భగీరథ ప్రయత్నం!

కరువును ఎదిరించి.. ఎండిన పొలాలను తడిపి.. చిన్నమాధారం అన్నదాతల భగీరథ ప్రయత్నం!
Advertisement

Nalgonda Farmers’ Innovative Plan: కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి.. సాగు భూములు బీడు భూములుగా మారుతున్నాయి.. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి.. ఇలాంటి కరువు పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. తమ కష్టాలకు తామే పరిష్కారం వెతుక్కున్నారు ఆ రైతులు. నాగార్జునసాగర్ వరద కాలువ నుంచి నీటిని మోటార్లతో లిఫ్ట్ చేసి.. గ్రామంలోని కుంటను నింపుతూ నీటి కష్టాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక్క మోటార్‌తో మొదలైన ఈ ప్రయత్నం.. ఇప్పుడు మూడు మోటార్లకు చేరింది. రైతుల ఐక్యతతో మొదలైన ఈ భగీరథ ప్రయత్నం.. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకూ ఆశలు రేపుతోంది. మంత్రి కోమటిరెడ్డి చొరవతో మరిన్ని గ్రామాల చెరువులు, కుంటలను నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ కరువును ఎదుర్కొనేందుకు రైతులు చేస్తున్న ఈ ప్రయత్నం ఏంటి? ఇతర గ్రామాలకు ఎలా ఆదర్శంగా మారుతోంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కరువుపై రైతుల పోరాటం..

సమస్య ఎదురైనప్పుడే పరిష్కారం కోసం అన్వేషణ మొదలవుతుంది. కష్టాలు చుట్టుముట్టినప్పుడే దాని నుంచి బయటపడే మార్గం కోసం వెతుకులాట ప్రారంభం అవుతుంది. అచ్చం ఇలాగే కరువుతో అల్లాడుతున్నతమ గ్రామాన్ని ఆ సమస్య నుంచి గట్టేక్కేలా చేసేందుకు ఒక్కటయ్యారు నల్లగొండ జిల్లా కనగల్ మండలం చిన్నమాధారం గ్రామంలో రైతులు. వర్షాలు లేక భూములు ఎండిపోతున్న పరిస్థితుల్లో.. నాగార్జునసాగర్ వరద కాలువ నీటిని గ్రామ సమీపంలోని కుంటకు మళ్లించాలనే ఆలోచన చేశారు. అంతా కలిసి డబ్బులు పోగుచేసి మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. కాలువ నుంచి నీటిని కుంటలోకి లిఫ్ట్ చేస్తూ.. భూగర్భ జలాలను పెంచడంతో పాటు సాగు, తాగునీటి కష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రైతుల చొరవకు ప్రభుత్వ సహకారం కూడా తోడవడంతో.. పరిసర గ్రామాల ప్రజల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ఒక్క మోటార్‌తో మొదలు..

Advertisement

2023లో చిన్నమాధారం గ్రామం తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంది. పంటలు కళ్ల ముందే ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటి గ్రామ ఎంపీటీసీ మల్లికంటి రాజు స్థానిక రైతులతో కలిసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. రైతులంతా తలా కొంత డబ్బు జమ చేసుకుని 20 హార్స్‌ పవర్ సామర్థ్యం ఉన్న మోటార్‌ను కొనుగోలు చేశారు. గ్రామ సమీపంలో ప్రవహించే నాగార్జునసాగర్ వరద కాలువకు మోటార్‌ను అనుసంధానించి నీటిని కుంటలోకి మళ్లించారు. అప్పట్లో 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో.. కేవలం 20 రోజుల్లోనే కుంటను నింపగలిగారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి.. కుంట కింద సుమారు 150 నుంచి 200 ఎకరాల్లో వరి సాగుకు అవకాశం ఏర్పడింది. తాగునీటి సమస్య కూడా కొంతమేర తగ్గింది. రైతుల ఐక్యతతో మొదలైన ఈ ప్రయత్నం.. గ్రామానికి ఊరటనిచ్చింది.

ఇప్పుడు మూడు మోటార్లతో నీటి లిఫ్టింగ్!

ఈసారి పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. వానాకాలంలోనూ ఆశించిన వర్షాలు లేకపోవడంతో.. ఎండల తీవ్రత పెరిగి పంటలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో చిన్నమాధారం గ్రామంలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకోవడం సవాలుగా మారింది. దీంతో గతంలో ఏర్పాటు చేసిన ఒక మోటార్‌ కు మరో రెండు మోటార్లను జతచేశారు. ప్రస్తుతం మూడు మోటార్ల సాయంతో నాగార్జునసాగర్ వరద కాలువ నుంచి నీటిని కుంటలోకి లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నీరు భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పడటంతో పాటు.. పంటలకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంతో పాటు యాసంగి పంటలకు కూడా నీటి భరోసా దొరికే అవకాశం ఉందని ఆనందపడుతున్నారు.

ఇతర గ్రామాలకు ఆదర్శంగా చిన్నమాధారం!

Advertisement

చిన్నమాధారం రైతులు తమ సొంత ఖర్చులతో వరద కాలువ నీటిని కుంటలోకి మళ్లిస్తున్న విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. తమ గ్రామాల్లోనూ చెరువులు, కుంటలు నింపితే సాగు, తాగునీటి సమస్యలు తగ్గుతాయని భావించిన ఆయా గ్రామాల ప్రజలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాల్లోనూ నీటి కష్టాలు తగ్గేలా చేస్తారనే ఆశలు ప్రజల్లో పెరిగాయి. చిన్నమాధారం రైతులు చూపిన చొరవ.. ఇప్పుడు ఇతర గ్రామాల ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చి.. చెరువులు నిండితేనే ఆయా గ్రామాల నీటి సమస్యలకు దీర్ఘకాలిక ఊరట లభించనుంది.

రైతుల చొరవకు మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు..

చిన్నమాధారం రైతుల భగీరథ ప్రయత్నాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. చిన్నమాధారంతో పాటు ఇరుగంటిపల్లి, బాబాసాయిగూడెం, చెట్ల చెన్నారం, ఎస్. లింగోటం తదితర గ్రామాల్లోని గొలుసుకట్టు చెరువులను నాగార్జునసాగర్ వరద కాలువ నీటితో నింపేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్ సీఈ గంగుల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి చెరువులను పరిశీలించారు. వాటి విస్తీర్ణం, నీటి లభ్యత, లిఫ్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై వివరాలు సేకరించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక గ్రామంలో రైతులు తమ కష్టాలకు తామే పరిష్కారం వెతుక్కుంటూ మొదలుపెట్టిన ప్రయత్నం.. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు ఆశాకిరణంగా మారుతోంది. అయితే, ప్రతిపాదనలు ఎంత త్వరగా కార్యరూపం దాలుస్తాయి? చెరువులకు నీరు చేరి రైతులకు శాశ్వత ఊరట ఎప్పుడు లభిస్తుంది? అన్నది వేచి చూడాలి.

Read Also: పొలం లేదు.. దుక్కి దున్నేది లేదు.. అయినా పంటలు పండుతాయి!

Tags

Related News

జర్నలిస్టుకు అండగా బిగ్ టీవీ చైర్మెన్ .. TWJF అభినందనలు

మోడల్ స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. లక్షల రూపాయలు ఇక సేఫ్!

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అప్పీల్.. ఏంటంటే?

సింగరేణిని ముంచింది బీఆర్‌ఎస్సే.. మంత్రి పొంగులేటి సంచలన విమర్శలు!

సీఎంఓ నుంచి బెదిరింపులు.. ప్రతి పనికి 15 శాతం కమీషన్.. కవిత సంచలన ఆరోపణలు!

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల డేటా విడుదల.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రూ. 5 లక్షలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్!

Big Stories

Advertisement
×