Congress: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మండల,పట్టణ,డివిజన్ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. గాంధీభవన్ లో ఈ మధ్యనే ఇందుకోసం జిల్లా అధ్యక్షులతో భేటీ నిర్వహించారు.ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. అంతే కాదు వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే కమిటీలు ఏర్పాటు చేసి తీరాల్సిందేనని ఆయన సూచించారు.
2028 లక్ష్యంగా కాంగ్రెస్ ఆపరేషన్..
పిసిసి పిలుపునిచ్చిన కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తోన్న వారి వివరాలూ ఆరా తీశారట.ప్రత్యేకించి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సర్ ప్రక్రియలో డిసిసి అధ్యక్షులు చురుగ్గా వ్యవహరించారా లేదా అన్నది కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఒకరిద్దరు అధ్యక్షులు అంత యాక్టివ్ గా లేరని తెలుసుకుని వారిపై సీరియస్ అయ్యారట. గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు గా అవతరించనుంది. ఈ మూడు కార్పొరేషన్లకు జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే గత ఎన్నికల్లో గ్రేటర్ లో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో తెలిసింది.వచ్చే ఎన్నికల నాటికి గ్రేటర్ లో బలం పుంజుకుంటేనే మరోసారి అధికారంలోకి రాగలమన్నది సావంత్ ఉద్దేశంగా చెబుతున్నారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల లోపే పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?