Degree Courses: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. కొత్త కోర్సులతో విద్యార్థుల తలరాతలు మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సాంప్రదాయ కోర్సుల కంటే మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూ 15 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఉన్నత విద్యామండలి దాదాపు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇప్పటికే 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సుల అమలుచేయడంపై డిగ్రీ కాలేజీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే దాదాపు 140కి పైగా కాలేజీలు కొత్త కోర్సులను తమ కాలేజీల్లో అమలుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది.
డిగ్రీ కళాశాలలు తమ వద్ద ఉన్న పాత కోర్సుల(డిమాండ్ లేని కోర్సుల) స్థానంలో లేదా డిమాండ్ ఉన్నట్లయితే వాటిని అలాగే కొనసాగిస్తూనే.. కొత్తగా కనీసం 3 కొత్త కోర్సులను ఇంప్లిమెంట్ చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రక్రియ గత నెలలోనే ముగిసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 140కి పైగా కళాశాలలు ఈ కొత్త కోర్సుల అమలుకు ఆసక్తి కనబరిచాయి. వీటితో పాటు మరిన్ని కళాశాలలు తమ పాత కోర్సులను కొత్త వాటిలోకి మార్చుకోవడానికి(కోర్స్ కన్వర్షన్) కు మొగ్గు చూపాయి. కోర్సుల కన్వర్షన్ జాబితాలో దాదాపు 60 వరకు కాలేజీలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త కోర్సులు 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
Also Read: అమిత్ షా స్కెచ్.. దీదీకి చెక్..! తెలంగాణలో అదే వ్యూహమా…! ఇక్కడంత సీన్ ఉందా??
ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఈ కోర్సుల సిలబస్, బోధనా పద్ధతులు మరియు మౌలిక సదుపాయాలపై పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేసింది. విద్యార్థులు కేవలం థియరీ చదువులకే పరిమితం కాకుండా, డిగ్రీ పూర్తి చేయగానే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి చెబుతున్నారు. ఐటీ, డేటా సైన్స్, అనలిటిక్స్ వంటి ఆధునిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను ఈ 15 కోర్సుల ద్వారా అందించనున్నారు. ఈ విద్యా సంస్కరణలు డిగ్రీ విద్యార్థుల కెరీర్‌కు కొత్త దిశను చూపుతాయని విద్యా నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్న 15 కోర్సుల్లో బీఏలో 3 కోర్సులు, బీబీఏలో 6 కోర్సులు, బీకామ్ లో 3, బీఎస్సీలో 3 కొత్త కోర్సులు ఉన్నాయి.
ఇంటర్ అనంతరం డిగ్రీలో జాయిన్ అయ్యే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. సాంప్రదాయ పద్ధతిలో వస్తున్న కోర్సులను కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఉన్నత విద్యామండలి రూపొందించింది. ఈ కొత్త కోర్సుల్లో మూడేళ్ల కోర్సులు 13 ఉండగా నాలుగేండ్ల కోర్సులు 2 ఉన్నాయి. వీటిలో బీఏలో.. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ కోర్సు, బీఏ ల్యాండ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ కోర్సు, బీఏ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్ కోర్సు, బీబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్ మెంట్, బీబీఏ ఎయిర్ పోర్ట్, ఎయిర్ లైన్, ఎయిర్ స్పేప్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కోర్సు, బీబీఏ ఫుడ్ టెక్నాలజీ, కామర్స్ మేనేజ్ మెంట్ కోర్సు, బీబీఏ ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ కోర్సు, బీబీఏ స్పేస్ టెక్నాలజీ, స్పేస్ కామర్స్ అండ్ స్పేస్ మేనేజ్ మెంట్ కోర్సు ఉన్నాయి. ఇకపోతే బీకామ్ లో బీకామ్ ఫైనాన్స్ టెక్నాలజీ, బీకామ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, బీకామ్ ఈకామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, బీఎస్సీలో క్లైమేట్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ మూడేళ్ల కోర్సులతో పాటు బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఏఐ ఎంఎల్ హానర్స్ నాలుగేండ్ల కోర్సుతో పాటు బీఎస్సీ డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ హానర్స్ నాలుగేండ్ల కోర్సు ఉన్నాయి.
Also Read: రయ్ రయ్ మంటూ ఈ-బస్సులు.. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవం!