Junior Lecturer: తెలంగాణ విద్యారంగంలోనే అతిపెద్ద స్కామ్. కోర్టులు చీకొట్టిన యూనివర్శిటీల నుంచి సర్టిఫికెట్లు తెచ్చి జూనియర్ లెక్చరర్ పోస్టులు కొట్టేశారు. 2023 ఎన్నికల్లో లాభం పొందడానికి BRS వేసిన రెగ్యులరైజేషన్ ఎత్తుగడ… చెల్లని డిగ్రీలు, దొంగ సర్టిఫికెట్ల ముఠాలకు ఎలా వరంగా మారిందో సాక్ష్యాలతో సహా BIG TV చూపిస్తోంది. చదువురాని సార్ల కేస్ స్టడీల్ని జనం ముందు పెడుతోంది. రెగ్యులర్, వొకేషనల్, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫేక్ లెక్చరర్ల నిజస్వరూపాన్ని చూస్తుంటే… ఇంటర్ విద్య ఎంత ఘోరంగా మారిందో అర్ధమవుతోంది. ఎంతమంది అర్హులైన నిరుద్యోగుల పొట్టకొట్టారో స్పష్టమవుతోంది.
దొంగ సర్టిఫికెట్లతో కాలేజీల్లో లెక్చరర్లు
కనీసం టెన్త్ కూడా లేకుండా దొంగ సర్టిఫికెట్లతో కాలేజీల్లో లెక్చరర్లుగా చేరినవాళ్లున్నారు. ఇక ఫేక్ పీజీలతో కాలేజీల్లో చేరినవాళ్ల సంఖ్యకు కొదవే లేదు. వినాయక మిషన్, కువెంపు, కామరాజ్, కళింగ యూనివర్సిటీ, అలహబాద్ హిందీ సాహిత్య సమ్మేళన్ లాంటి సంస్థల నుంచి పీజీలు తెచ్చుకుని పోస్టులు కొట్టేశారు. కొన్ని సంస్థలు అసలు విద్యాసంస్థలే కాదు. కొన్ని యూనివర్సిటీల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. కొన్ని వర్సిటీల్లో చేసిన డిస్టెన్స పీజీలు తెలంగాణలో చెల్లవు. ఇలా అధికారిక లెక్కల ప్రకారం కోర్టు తీర్పులు, UGC నిబంధనలకు వ్యతిరేకంగా పీజీలు ఉన్నవాళ్లు 638 మంది ఉన్నట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. కానీ ఈ లెక్క 1,000కి పైనే అని అధికారులే ఆఫ్‌ద రికార్డ్ చెప్తున్నారు.
అక్రమాల్ని ఇంకా ఇంకా బయటకు తీయాలి..
BIG TV వచ్చే కథనాలకు ప్రజల స్పందన, మద్దతు కూడా అనూహ్యంగా వస్తోంది. నికార్సయిన జర్నలిజం అంటే ఇదే అంటూ… మాకు మద్ధతుగా పలువురు నిలబడుతున్నారు. వాళ్ల అభినందనల్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. రెగ్యులరైజేషన్‌లో జరిగిన అక్రమాల్ని ఇంకా ఇంకా బయటకు తీయాలని కోరుతున్నారు. 2023లో రెగ్యులర్ అయిన అందరి సర్టిఫికెట్లు మళ్లీ వెరిఫై చేయాలంటున్నారు. కొందరు తమకు తెలిసిన ఫేక్ లెక్చరర్ల వివరాల్ని కామెంట్ల రూపంలో చెప్తున్నారు.
మరో 10 మందికి నోటీసులు..
ఇప్పటికే BIG TV కథనాలతో 35 మంది నకిలీగాళ్లను టెర్మినేట్ చేశారు. ఇంకో 10 మందికి నోటీసులు ఇచ్చారు. టెర్మినేట్ అయిన 35మంది జూనియర్ లెక్చరర్లపై క్రిమినల్ చర్యలకు ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ కు ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా ఇచ్చారు. క్రిమినల్ కేసుల నమోదు, జీతాల రికవరీపై లీగల్ ఒపీనియన్ తో ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అక్రమంగా శాశ్వత ఉద్యోగాలు పొందిన చదువురాని సార్లు అందరిపైనా చర్యలు తీసుకోవాలని BIG TV కోరుతోంది. ఇదంతా జరిగే వరకు BIGTV పోరాటం ఆగదు. మరోసారి ఇలాంటి స్కామ్ జరగకూడదని BIG TV ప్రయత్నిస్తోంది.
Also Read: 9 ఏళ్ల హైదరాబాద్ మెట్రో.. వెయ్యి కోట్ల నష్టాలు! అసలు కారణం ఇదే!