Uttam Kumar: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలు, అవినీతి వల్లే నేడు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం చేశారు.
ప్రాణహిత-చేవెళ్ల చేపట్టి ఉంటే ఇబ్బందులు ఉండేవి కావు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా ఒక తప్పిపోయిన నిర్ణయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఒకవేళ గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నేడు రాష్ట్రంలో ఈ స్థాయి నీటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నాణ్యత లేకుండా కట్టిన ప్రాజెక్టులు ఆ కాలంలోనే కూలిపోయాయని, దీనికి ఆ పార్టీ నాయకులే నైతిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
అర్హత లేని వారికే బాధ్యతలు..
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు ఒక ఆర్మీ అధికారిని డిప్యూటేషన్‌పై తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మూడు బ్యారేజీల గేట్లను ఎత్తకూడదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) స్పష్టంగా చెప్పిందని, తాము వారి మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. రిపేర్ పనులకు అయ్యే ఖర్చులను అంచనా వేస్తున్నామని, కాంట్రాక్టు తీసుకున్న వారే ఆ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకు గ్లోబల్ ఎలినినో ప్రభావం కూడా కారణమని, కానీ బీఆర్ఎస్ తెచ్చిన భారీ అప్పుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే ఇబ్బందులు మరింత పెరిగాయని మంత్రి విమర్శించారు. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు లేకపోయినా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈసారి రాష్ట్రంలో వరి పంటను పండించామని గుర్తుచేశారు. సీతారామ సాగర్ ప్రాజెక్టును కేవలం రెండు వేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సి ఉండగా.. వేల కోట్లకు పెంచినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. స్వయంగా తాము కట్టిన ప్రాజెక్టును కూల్చుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని, వారి గ్లోబల్ ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు.
Also Read: ఆర్టీఏలో రొటేషన్‌కు రాంరాం.. హోంగార్డులదే రాజ్యం!