Transport Department: స్వేచ్ఛ బ్యూరో: రవాణా శాఖలో విధుల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన చోట కొందరు హోంగార్డుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం విధుల కేటాయింపు, రొటేషన్ విధానం అమలుకావాల్సి ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర రవాణా అథారిటీ(ఎస్టీఏ) పరిధిలో సుమారు 280 మంది హోంగార్డుల విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వారికి 2012 నుంచి రొటేషన్ విధానం నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేసే కొంతమంది హోంగార్డుల పనితీరు వివాదస్పదమవుతోంది.
ప్రశ్నించే అధికారులపై ఒత్తిడి..
రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, ఇతర పౌర సేవలకు సంబంధించి అనేక పనులు జరుగుతుంటాయి. ఇలాంటి చోట విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే కొందరు హోంగార్డులు తమకు అప్పగించిన విధుల పరిధిని దాటి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల సూచనలను పట్టించుకోకపోవడం, ప్రశ్నించిన అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణల్లో వాస్తవాలు తేల్చేందుకు ఉన్నతాధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రొటేషన్ విధానం ఎక్కడ?
ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకే చోట దీర్ఘకాలం పనిచేయడం వల్ల అనధికారిక పరిచయాలు పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో పలు విభాగాల్లో కాలానుగుణంగా విధుల మార్పిడి చేపడుతుంటారు. రవాణా శాఖలోనూ హోంగార్డుల విధుల కేటాయింపులో రొటేషన్ విధానం అమలుపై స్పష్టత అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2012 నుంచి ఈ విధానం నిలిచిపోయింది. ఇన్నేళ్లుగా ఎందుకు తిరిగి అమలు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుశాఖ హోంగార్డుల నియామక ప్రక్రియ చేపడుతుంది. రవాణాశాఖ అవసరం మేరకు హోంగార్డులను కేటాయిస్తుంది. దీంతో వారిపై పర్యవేక్షణను శాఖ అధికారులే చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఆ హోంగార్డులకు గతంలో రాష్ట్రంలోని ఏ ఆర్టీఏ కార్యాలయానికి కేటాయించిన రోటేషన్ పద్దతిలో నెలరోజులపాటు రాష్ట్ర ఏస్టీఏ(స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ) కార్యాలయంలో పనిచేసేలా చర్యలు చేపట్టారు. దీంతో రాష్ట్ర కార్యాలయంలో ఏం జరుగుతుంది? అధికారులతో ఎలా వ్యవహరించాలి అనేది తెలిసేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 2012 నుంచి రొటేషన్ పద్దతికి స్వస్తిపలికినట్లు సమాచారం. దీంతో హోంగార్డులు ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి రొటేషన్ కూడా చేయాల్సి ఉన్నా చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కార్యాలయాల్లో ఏజెంట్ల పాత్ర?
జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేవారు, ఇతర సేవలు పొందేవారు నిబంధనల ప్రకారం తమ పనులు పూర్తి చేసుకోవాలి. అయితే కొందరు హోంగార్డులు ఒకే దగ్గర ఏళ్ల తరబడి పనిచేయడంతోనే పరిచయాలు పెరుగుతున్నాయి. ఏజెంట్లతోనూ వారికి తత్సంబంధాలు పెరిగి కొందరు ఏజెంట్ల అవతారం ఎత్తుతున్నారనే ప్రచారం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కార్యాలయాల్లో ఎవరిని కలవాలి? ఏ అధికారి వద్ద పని త్వరగా పూర్తవుతుంది? ఏ పత్రాలు ఎక్కడ సమర్పించాలి? వంటి విషయాల్లోనూ వారు జోక్యం చేసుకుంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
కొందరు డ్రైవింగ్ స్కూల్లు?
కొందరు హోంగార్డులు డ్రైవింగ్ స్కూల్లు పెట్టి నడిపిస్తున్నారని, అంతేకాదు ప్రైవేటు ఏజెంట్లను సైతం పెట్టి వ్యవహారాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న అధికారులతో దందా కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంతటితో ఆగకుండా అధికారుల వ్యక్తిగత జీవితాల్లోకి సైతం ఎంటర్ అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా హోంగార్డుల దందాను ప్రశ్నిస్తే ఆ అధికారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్, నల్లగొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ హోంగార్డులదే హవా నడుస్తున్నట్లు సమాచారం.
గతంలో ఏసీబీ పేరుతోనూ టోకరా..
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల పేరును ప్రస్తావిస్తూ గ్రేటర్ పరిధిలోని ఓ ఆర్టీఏ కార్యాలయంలో పనిచేసిన హోంగార్డు శాఖలోని అధికారులనే బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై అధికారులు ఆరా తీసి సంబంధిత హోంగార్డును సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్న సందర్భం సైతం ఉంది. అంతేకాదు కొందరు హోంగార్డులు మహిళా అధికారులను సైతం బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు జిల్లాల్లో వెలుగులోకి రాగా, కేసులు నమోదైన ఘటనలు సైతం ఉన్నట్లు సమాచారం.
కొందరి తీరుతో శాఖకు చెడ్డపేరు
జిల్లా రవాణా శాఖలో పనిచేస్తున్న కొందరు హోంగార్డులు విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నప్పటికీ, మరికొందరిపై వస్తున్న ఆరోపణలతో మొత్తం శాఖ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజలకు సేవలందించే కార్యాలయాల్లో అనధికారిక మధ్యవర్తిత్వానికి, బెదిరింపులకు, అధికార దుర్వినియోగానికి తావులేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది. గతంలో ఉన్న రొటేషన్ పద్దతిని కొనసాగించాలని, జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులపై నిఘా పెట్టాలని, ఉన్నతాధికారులు ప్రతి 4 ఏళ్లకు ఒకసారి బదిలీలు చేపట్టాలని, ఏజెంట్లకు సహకరించేవారిపై, ఆరోపణలు వస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని అప్పుడే రవాణాశాఖ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని కావడం కష్టమే.. రాంచందర్ రావు సెటైర్లు