Madhapur: హైదరాబాద్ సిటీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లోని ఓ హోటల్ గదిలో టీనేజ్ యువతి అనుమానాస్పదం గా మృతి చెందింది. యువతి సొంతూరు విశాఖ నగరానికి చెందినది. తన ప్రియుడితో సోమవారం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే ఆమె ప్రియుడు పరారీలో ఉన్నాడు. అసలు ఏం జరిగింది?
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖ నగరానికి చెందిన 23 ఏళ్ల యువతి షారన్ నిఖిత టోప్నో.. ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మాదాపూర్ ప్రాంతంలోని సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్-5లోని ఓ హోటల్‌లో దిగారు. మరి రాత్రి ఏం జరిగిందో తెలీదు. మంగళవారం ఉదయం కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి నుంచి మాదాపూర్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఓ యువతిని ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజ, హోటల్ సిబ్బంది కలిసి అత్యవసర చికిత్స నిమిత్తం తీసుకొచ్చినట్లు అందులోని సారాంశం. ఆమెని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలియగానే పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు.
మృతదేహాన్ని అన్నికోణాల్లో పరిశీలించారు. మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. అలాగే ఒంటిపై పలుచోట్ల వాపులు ఉన్నట్లు గుర్తించారు. యువతి మృతి చెందిన విషయం తెలియగానే ప్రియుడు ఆసుపత్రి సిబ్బందికి కంటపడకుండా పరారయ్యాడు. ఆసుపత్రి నుంచి హోటల్‌కు వచ్చిన పోలీసులు, గదిని క్షుణ్నంగా పరిశీలించారు. గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉన్నాయి. వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి సాక్ష్యాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు శ్రీనివాస రవితేజ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. మరోవైపు యువతి వద్ద లభించిన ఆధారాలతో విశాఖలోని వారి తల్లిదండ్రులను సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం హోటల్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే హోటల్ లో దిగేముందు ఇచ్చిన ఫోన్ నెంబర్లు సమాచారం సేకరిస్తున్నారు. యువతి మృతి వెనుక ఏం జరిగిందో చూడాలి.
ALSO READ: అరెస్టులకు భయపడేది లేదు.. అన్నదాతల తరఫున పోరాటం ఆపేది లేదు!- రామచందర్ రావు