Jurala Project: జూరాల ప్రాజెక్టును సందర్శించి, నీటి విడుదల లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి బయలుదేరిన తమను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్ల వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని ఎండగట్టారు.
పంటలు ఎండిపోతున్నా పట్టని సర్కారు
జూరాల రిజర్వాయర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ.. అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు వేసి, సాగు చేసుకున్న పంటలు కళ్లముందే నాశనమవుతుంటే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీళ్లు తెప్పించాలి
పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అక్కడ ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో ఏకంగా 94 శాతానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కర్ణాటక సర్కారుతో చర్చలు జరిపి, ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయించి ఇక్కడి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అరెస్టులకు భయపడేదే లేదు
రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని రామచందర్ రావు విమర్శించారు. బాధితులకు మద్దతుగా వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టులు చేయిస్తూ అణచివేయాలని చూస్తోందన్నారు. ‘ఇలాంటి ముందస్తు అరెస్టులకు, బెదిరింపులకు మేము భయపడేదే లేదు. రైతుల సంక్షేమం కోసం, వారి హక్కుల పోరాటం కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!