Bottle Harbour Island: ఎంతో ఆశగా వెళ్లిన హాలిడే స్పాట్ లో మెుబైల్ సిగ్నల్ లేకపోతే? కనీసం తిరగడానికి వాహనాలు కూడా లేకుండా, ఊరంతటికీ ఒకే ఒక్క వైఫై స్పాట్ ఉంటే ఏం చేస్తారు? ‘బాబోయ్ నా వల్ల కాదు’ వెనక్కి వచ్చేస్తామని చాలా భావిస్తారు. కానీ డిజిటల్ ప్రపంచంలో ప్రశాంతంగా గడపడానికి చాలా మంది పర్యాటకులు ఈ తరహా ప్రాంతాలకే వెళ్తున్నారు. కెనడాలోని లాబ్రడార్ తీరంలో ఉన్న ‘బాటిల్ హార్బర్’ అనే చిన్న ద్వీపం.. ఇప్పుడు ఇదే ట్రెండ్‌తో వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఈ ‘బాటిల్ హార్బర్ ద్వీపం’.. ఒకప్పుడు మత్స్యకార కేంద్రంగా ఎంతో హడావిడీగా ఉండేది. కేవలం అర మైలు పొడవు ఉండే ఈ ద్వీపం లాబ్రడార్ ప్రాంతంలో చేపల వేటకు ఎంతో పాపులర్ అయ్యింది. 1770ల కాలంలో ఆంగ్ల వ్యాపారి జాన్ స్లేడ్ ఇక్కడ తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన ఉప్పు చేపలను (సాల్ట్ కాడ్) యూరప్, కరేబియన్ దేశాలకు ఎగుమతి చేసేవారు. ఒకానొక దశలో ఈ ద్వీపంలో ఆసుపత్రి, పాఠశాల, చర్చి, వైర్లెస్ స్టేషన్ వంటి సదుపాయాలు కూడా ఏర్పడ్డాయి. దాదాపు 300 మంది శాశ్వత నివాసితులతో పాటు, వేల సంఖ్యలో మత్స్యకారులు సీజన్లలో ఇక్కడకు వచ్చేవారు.
కాలక్రమేణా ఈ ద్వీప సౌభాగ్యం మసకబారడం మొదలైంది. 1930లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంతో పాటు సముద్రంలో చేపల సంఖ్య తగ్గడం, 1960లలో ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమం వల్ల బాటిల్ హార్బర్ క్రమంగా ఖాళీ అయింది. 1970 నాటికి ఇక్కడున్న శాశ్వత నివాసితులందరూ వెళ్లిపోయారు. ఇక 1992 జూలై 2న కెనడా ఫెడరల్ ప్రభుత్వం ‘కాడ్’ చేపల వేటపై నిషేధం విధించడంతో ఈ ప్రాంత మత్స్యకార రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్ అంతటా దాదాపు 30,000 మంది ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతాలను విడిచిపెట్టి చాలా మంది మత్స్యకారులు ఇతర తీర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.
శాశ్వత నిర్వాసితులు లేక ‘బాటిల్ హార్బర్ ద్వీపం’ కొన్నేళ్ల పాటు నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే అక్కడి స్థానిక ప్రభుత్వం.. ఈ దీవిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని నిర్ణయించింది. అక్కడి పాతకాలపు కొయ్య ఇళ్లు, ఓడ రేవులు, చారిత్రక కట్టడాలను పునరుద్ధరించింది. ఫలితంగా ఇక్కడి పురాతన కాటేజీలు, పాత మర్చంట్ భవనాల్లోని గదుల్లో బస చేసేందుకు పర్యాటకులకు అవకాశం లభించింది.
అయితే ఈ దీవిలో బస చేయడానికి వచ్చే వారికి బయటి ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోనున్నాయి. ఇక్కడ టీవీలు ఉండవు. ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్ల గోల అంతకంటే ఉండదు. కేవలం అలల చప్పుడు, అడవి జంతువుల శబ్దాలు మాత్రమే మిమ్మల్ని పలకరిస్తాయి. ఈ ద్వీపంలో ఆర్కిటిక్ నక్కలు కూడా సంచరిస్తుండటం గమనార్హం. ఈ దీవిలోని పాతకాలపు రోడ్లు, పురాతన సమాధులు, మత్స్యకార రంగానికి సంబంధించిన చారిత్రక భవనాలను పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Also Read: బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!
అయితే ఈ బాటిల్ హార్బర్ దీవికి చేరుకోవడం కూడా ఒక సాహసంతో కూడుకున్న ప్రయాణమే. పర్యాటకులు ముందుగా ‘హ్యాపీ వ్యాలీ-గూస్ బే’కి విమానంలో వెళ్లి అక్కడి నుంచి ‘మేరీస్ హార్బర్’ వరకు ఐదు గంటల పాటు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ప్యాసింజర్ ఫెర్రీ పడవలో ద్వీపానికి చేరుకోవాలి. ఈ 60 నుంచి 75 నిమిషాల పడవ ప్రయాణంలో అందమైన తీరప్రాంతం, సముద్ర పక్షులు, మంచు కొండలు (ఐస్‌బర్గ్స్), నీటిపై తేలియాడే ‘హంప్‌బ్యాక్ తిమింగలాలు’ పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి.