Indian Auto: సాధారణంగా విదేశీయులు భారతదేశానికి వస్తే.. ఇక్కడి జ్ఞాపకాలను గుర్తుగా అందమైన చేతివృత్తుల వస్తువులు, సాంప్రదాయ దుస్తులు, ఇక్కడ దిగిన ఫోటోలను వెంట తీసుకెళ్తుంటారు. కానీ ఓ బ్రిటిష్ జంట మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ భారతదేశపు ఐకానిక్ వాహనమైన మూడు చక్రాల ఆటోను తమ దేశానికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బ్రిటన్‌కు చెందిన లిల్లీ, కాలమ్ జంట భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రయాణించడానికి ఒక ఆటోను కొనుగోలు చేశారు. ఎరుపు, నలుపు రంగుల చారలతో ఉండే ఈ ఆటోలో వారు ఏకంగా 4,218 కిలోమీటర్ల మేర దేశమంతటా ప్రయాణించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆ ఆటోనే వారికి పూర్తి ఆధారంగా మారింది. దానిపై ఉన్న ప్రేమాభిమానాలతో ఆ ఆటోకు వారు ‘టిమ్మీ ది టిన్ క్యాన్’ (Timmy the Tin Can) అని పేరు కూడా పెట్టుకున్నారు. ఆటో ముందు భాగంలో చిన్న పిల్లలను ఆకట్టుకునేలా కార్టూన్ కళ్లు, నవ్వుతున్న బొమ్మ కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైలో రిజిస్టర్ అయిన ఈ ఆటో నంబర్ ‘TN 03 AA 4342’ కావడం గమనార్హం.
నెలల తరబడి తమ పర్యటనలో భాగమైన ఆటోను భారత్‌లోనే వదిలేసి వెళ్లడానికి ఆ జంట మనసు ఒప్పలేదు. దాంతో దానిని ఎలాగైనా తమ వెంట బ్రిటన్‌కు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆటోను ఒక పెద్ద షిప్పింగ్ కంటైనర్‌లో ప్యాక్ చేసి సముద్ర మార్గం ద్వారా తమ స్వదేశానికి పంపారు. సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత ఆరు నెలలకు ఆ ఆటో బ్రిటన్ రేవుకు చేరుకుంది. ‘ఇండియాలో 4,218 కిలోమీటర్లు తిరిగిన తర్వాత టిమ్మీని వదిలేయడం మా వల్ల కాలేదు. ఆరు నెలల తర్వాత టిమ్మీ ఎట్టకేలకు UK చేరుకున్నాడు’ అంటూ వారు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Also Read: తమిళనాడులో సంచలనం.. అవినీతి కేసులో మాజీ మంత్రి అన్బిల్ మహేష్ అరెస్టు
అయితే ఇంతటి ఆనందంలో ఉన్న ఆ జంటకు ఊహించని షాక్ తగిలింది. ఆటో బ్రిటన్ పోర్టుకు చేరుకున్నప్పటికీ వారు దానిని వెంటనే ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బ్రిటన్‌లోని కఠినమైన రోడ్డు రవాణా, కస్టమ్స్ నిబంధనల ప్రకారం.. విదేశీ వాహనాన్ని రోడ్లపై నడపాలన్నా లేదా చట్టబద్ధంగా ఇంటికి తీసుకెళ్లాలన్నా చాలా రకాల పేపర్ వర్క్స్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఈ జంట నిమగ్నమైంది.
?utm_source=ig_embed&ig_rid=As4U9WoFSIW3jg2CDslJTfK
Also Read: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే.. ఆర్థికంగా సర్వనాశనమే!