Train Passenger Death Case: రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిన కేసులో కోల్ కత్తా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్యాసింజర్ రైల్లో నుంచి పడి చనిపోవడం అవాంఛనీయ సంఘటనగా అభివర్ణించిన న్యాయస్థానం, బాధితుడి కుటుంబానికి రూ. 8 లక్షల పరిహారం అందించాలని రైల్వేశాఖను ఆదేశించింది. అంతకు ముందుకు ఈ కేసులో బాధితుడి కుటుంబానికి ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ట్రిబ్యునల్) తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.
అసలు ఏం జరిగిందంటే?
బెంగాల్ లోని బిర్షిబ్ పూర్ కు చెందిన కాశీనాథ్ అనే వ్యక్తి జూన్ 2, 2001 నాడు తన భార్య సుశీలతో కలిసి రామరాజతల రైల్వే స్టేషన్ కు వెళ్లాలి అనుకున్నారు. ఇద్దరూ కలిసి బిర్షిబ్ పూర్ రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్ ఎక్కారు. కాసేపట్లో దిగుదాం అనే సమయంలో రైలు కుదుపుకు గురయ్యింది. అదే సమయంలో రైళ్లో ఎక్కువ మంది ఉండటంతో కాశీనాథ్ ప్రమాదవశాత్తు రైల్లో నుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతడిని హౌరా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుమారు 15 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన, ఆ తర్వాత చనిపోయారు. అయితే, తన భర్త మృతికి రైల్వే సంస్థ కారణమని ఆరోపిస్తూ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది ఆయన భార్య సుశీల. తన కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కోరింది. ఆమె ఫిర్యాదును పరిశీలించిన రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్.. ఈ కేసులో రైల్వే సంస్థది ఎలాంటి తప్పులేదని తేల్చింది. బాధితుడి కుటుంబానికి ఆర్థికం సాయం అందించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
Read Also: హైపర్‌లూప్ ట్రైన్ టెస్టింగ్ ట్రాక్ సిద్ధం చేసిన ఐఐటీ మద్రాస్.. రెప్పపాటులో గమ్యానికి చేరిపోవచ్చట!
బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలన్న హైకోర్టు
ఈ నేపథ్యంలో కాశీనాథ్ సతీమణి కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని, న్యాయం చేయాలని వేడుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. రైల్లో నుంచి ప్రయాణీకుడు పడి చనిపోయాడంటే ఆ బాధ్యత కచ్చితంగా రైల్వే సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రయాణీకుడు టికెట్ ను కలిగి ఉండటంతో పాటు పోస్టుమార్టం నివేదిక, పోలీసులు రిపోర్టు కూడా ప్రమాదవశాత్తు రైల్లో నుంచి పడిపోవడం వల్లే చనిపోయాడని సూచిస్తున్నాయని అభిప్రాయపడింది.ఈ మరణం అవాంఛనీయ సంఘటనగా అభివర్ణించిన కోర్టు రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124A ప్రకారం మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెల్లడించింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టిపారేసింది. వెంటనే బాధితుడి కుటుంబానికి రూ. 8 లక్షల పరిహారం అందించాలని రైల్వేశాఖను ఆదేశించింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత తమకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల కాశీనాథ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలస్యం అయినా, తమకు న్యాయం జరిగిందన్నారు.
Read Also: స్పీడు పెంచిన వందే భారత్.. ఈ రూట్లో మరింత వేగంగా గమ్యానికి, ఎంత టైమ్ తగ్గుతుందంటే..