Vande Bharat Train: భారతీయ రైల్వేలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు గరిష్టంగా గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. కానీ, అధికారులు ఈ రైలు వేగాన్ని భద్రతా కారణాల దృష్ట్యా 160 కిలో మీటర్లకు మించి నడపకూడదని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిలికాన్ సిటీ బెంగళూరు, సౌత్ సిటీ చెన్నై మధ్య నడిచే వందేభారత్ రైలు వేగాన్ని పెంచాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 25 నిమిషాలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు గంటల 25 నిమిషాల సమయం పడుతుండగా, ఇకపై 4 గంటల్లోనే రైలు గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వందేభారత్ రైలు వేగంతో పాటు సామర్ధ్యాన్ని పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
శతాబ్ది ఎక్స్ ప్రెస్ వేగం 130 కిలో మీటర్లకు పెంపు
అటు ఈ రూట్ లో నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు వేగాన్ని సైతం పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మార్గంలో సుమారు 5 గంటల ప్రయాణం సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే బెంగళూరు- జోలార్ పేట సెక్షన్ లో వేగ పరిమితిని గంటలకు 100 కిలో మీటర్ల నుంచి 130 కిలో మీటర్లకు పెంచనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయం కనీసం 20 నిమిషాలు తగ్గుతుంది. ఇప్పటికే స్పీడ్ పెంపుకు సంబంధించి అధికారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి అనుమతి రాగానే కొత్త వేగ పరిమితి అమలులోకి వస్తుంది.
Read Also: చార్ట్ ప్రిపేర్ అయినా కన్ఫార్మ్ టికెట్ దొరుకుతుంది సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు!
బెంగళూరు-చెన్నై రైళ్ల స్పీడ్ అప్ డేట్స్
గత సంవత్సరం, చెన్నై-జోలార్‌పేట రూట్ లో రైళ్ల వేగ పరిమితిని గంటకు 130 కిలో మీటర్లకు పెంచారు. ప్రస్తుతం ఈ రూట్ లో శతాబ్ది ఎక్స్ ప్రెస్ 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు బెంగళూరు-జోలార్ పేట మార్గంలో రైలు వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే టెస్ట్ రన్ సక్సెస్ అయిన నేపథ్యంలో త్వరలో రైల్వేశాఖ నుంచి అధికారికంగా వేగం పెంపుకు సంబంధించి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆమోదం తర్వాత బెంగళూరు- చెన్నై నడుమ ఈ ప్రయాణ వేగం గంటకు 130 కిలో మీటర్లకు చేరుకోనుంది.
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రయాణీకులు
మొత్తంగా బెంగళూరు, చెన్నై రూట్ లో వందేభారత్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లు తమ గరిష్ట వేగంతో నడిచే అవకాశం ఉంది. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రజలు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోనున్నారు. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: హైపర్‌లూప్ ట్రైన్ టెస్టింగ్ ట్రాక్ సిద్ధం చేసిన ఐఐటీ మద్రాస్.. రెప్పపాటులో గమ్యానికి చేరిపోవచ్చట!