Raksha Bandhan 2025: రాఖీ పండగ అన్నదమ్ముల మధ్య పవిత్రమైన సంబంధం, ప్రేమ, నమ్మకానికి చిహ్నం. ఈ రోజున.. సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టి, అతని దీర్ఘాయుష్షు, ఆనందం, భద్రత కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు తన సోదరిని రక్షిస్తానిని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇదిలా ఉంటే పండగ రోజు కట్టిన రాఖీని తర్వాత మణికట్టుపై ఎంతకాలం ఉంచాలి అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతూ ఉంటుంది. దీనిని వెంటనే తొలగించాలా లేదా దీనికి ఏదైనా ప్రత్యేక సంప్రదాయం ఉందా ? అని ఆలోచిస్తుంటారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మత విశ్వాసం:
సనాతన సంప్రదాయం ప్రకారం శుభం కలిగించే వస్తువును వెంటనే తీసివేయడం మంచిది కాదని భావిస్తారు. రాఖీని రక్షణ దారంగా భావిస్తారు. ఇది సోదరుడిని ప్రతికూల శక్తులు, విపత్తుల నుంచి రక్షిస్తుంది. పండగ తర్వాత రాఖీని పౌర్ణమి నుంచి.. వచ్చే పదిహేను రోజుల పాటు అలాగే ఉంచడం చాలా శుభప్రదమని నమ్ముతారు. ఈ సమయం సోదరుడు, సోదరి మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుందని చెబుతారు.
జన్మాష్టమి వరకు కట్టుకునే ఆచారం:
కొన్ని నమ్మకాల ప్రకారం.. జన్మాష్టమి వరకు రాఖీని మణికట్టు నుంచి తీయకూడదు. ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 9న వచ్చింది. జన్మాష్టమి ఆగస్టు 16న జరుపుకోనున్నాము. జన్మాష్టమి తర్వాత.. రాఖీని తీసివేసి, నీరు ప్రవహించే చోట లేదా చెట్టు కింద ఉంచడం వంటివి చేయాలి.
16 రోజుల నియమం:
పంచాంగం, జ్యోతిష్యం ప్రకారం.. రాఖీని 16 రోజులు మణికట్టుపై ఉంచడం చాలా ఫలవంతమైనది. పౌర్ణమి తర్వాత వచ్చే 16వ రోజు రాఖీని ప్రవహించే నీటిలో ముంచడం వల్ల సోదరుడి ఆయుర్దాయం, విజయం , శ్రేయస్సు పెరుగుతుంది.
Also Read: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !
దసరా వరకు ధరించే సంప్రదాయం:
కొన్ని ప్రాంతాలలో.. దసరా వరకు రాఖీని కట్టే సంప్రదాయం ఉంది. దసరా చెడుపై మంచి విజయానికి చిహ్నం. ఈ రోజు వరకు మణికట్టుపై కట్టిన రాఖీ సోదరుడికి రక్షణ కవచంగా పనిచేస్తుందని, అన్ని రకాల ప్రమాదాల నుంచి అతన్ని రక్షిస్తుందని నమ్ముతారు.
రాఖీని తొలగించడానికి సరైన మార్గం:
రాఖీని పారవేయడం మంచిది కాదు. ఇది ఒక పవిత్రమైన దారం, దానిని తీసివేసిన తర్వాత, నది, చెరువు వంటి వాటిలో వేయడం మంచిది. ఎందుకంటే ఇది సోదరుడి యొక్క అన్ని కష్టాలను, ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. నీటి వనరులు అందుబాటులో లేకపోతే.. దానిని భక్తితో చెట్టు కింద లేదా తులసి మొక్క దగ్గర పెట్టాలి.