D-Mart: చౌక ధరల్లో క్వాలిటీ వస్తువులు దొరకడంతో డీ-మార్ట్ లో షాపింగ్ చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. నిత్యవసరాలు మొదలుకొని గృహోపకరణాల వరకు ఎక్కడా లభించని డిస్కౌంట్లు ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా పేదల, మధ్య తరగతి ప్రజలకు ఇక్కడి ధరలు అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది డి-మార్ట్ కు వచ్చి సరుకులు, సామాన్లు కొనుగోలు చేస్తారు. బిజినెస్ బాగానే ఉన్నా, డి-మార్ట్ యాజమాన్యాన్ని కొత్త సమస్య వేధిస్తోంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ!
డి-మార్ట్ లో బిజినెస్ చాగా బాగా సాగుతుంది. నిత్యం ఒక్కో స్టోర్ లో లక్షల రూపాయల అమ్మకాలు జరుగుతాయి. అదే సమయంలో దొంగతనాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. డి-మార్ట్ స్టోర్లలో చాక్లెట్లు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, పెర్ఫ్యూమ్‌లు, ఇతర చిన్న చిన్న వస్తువుల దొంగతనం పెరిగింది. చాలా మంది యువతీ యువకులు స్టోర్ లోని చాక్లెట్లు, స్నాక్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం చేస్తున్నారు. విలువైన చాక్లెట్లను, డ్రింక్స్ ను తీసుకెళ్లి ట్రయల్ రూమ్స్ లో చక్కగా తినేసి బయటకు వస్తున్నారట. ఫెర్ప్యూమ్స్ సహా మరికొన్ని విలువైన వస్తువులను అండర్ వేర్ లో దాచుకుని వెళ్తున్నారట. ఇలాంటి దొంగతనాల కారణంగా స్టోర్ కు రోజుకు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు నష్టం జరుగుతుందంటున్నారు స్టోర్ నిర్వాహకులు.
డి-మార్ట్ స్టోర్లలో జరిగిన ఇతర దొంగతనాలు
⦿ హైదరాబాద్‌లో చాక్లెట్ దొంగతనం (జనవరి 2024):
హైదరాబాద్ లోని షేక్ పేట్ లో ఉన్న డి-మార్ట్ స్టోర్ లో 22 ఏళ్ల హనుమాన్ నాయక్ అనే వ్యక్తి చాక్లెట్లను దొంగిలించడమే కాకుండా, దానిని రికార్డ్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ గా పోస్ట్ చేశాడు. ఈ విషయం స్టోర్ యాజమాన్యానికి తెలియడంతో మేనేజర్ అర్జున్ సింగ్ ఫిర్యాదు చేశాడు. నాయక్ ను ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం, మోసం, కుట్ర సహా పలు సెక్షన్ల కింత అతడిపై కేసు నమోదు చేశారు.
⦿ హైదరాబాద్ లో కార్డమమ్ దొంగతనం (జూలై 2025):
హైదరాబాద్ లోని సనత్ నగర్ డి-మార్ట్ బ్రాంచ్ లో ఒక యువకుడు కార్డమమ్ ప్యాకెట్లను తన అండర్ వేర్ లో దాచుకుని దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలో అతడు సక్సెస్ అయ్యాడు. అదే రోజు మళ్లీ స్టోర్ కు వచ్చి అదే విధంగా దొంగతనం చేయడానికి ప్రయత్నించినప్పుడు సిబ్బంది అతన్ని CCTV ఫుటేజ్ ఆధారంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
⦿ డి-మార్ట్ సిబ్బంది దొంగతనం (ఆగస్టు 2022):
బెంగళూరులోని బనశంకరి డి-మార్ట్ స్టోర్ లో పరశురామ్ అనే ఉద్యోగి రూ. 10 లక్షల విలువైన వస్తువులను దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడు బార్ కోడ్లను మార్చి, ఎక్కువ ధరల వస్తువులను తక్కువ ధరలుగా బిల్లింగ్ గా చూపించి దొంగతనం చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దొంగతనాలు జరగకుండా యాజమాన్యం తీసుకున్న చర్యలు
⦿ భద్రతా చర్యలు: విలువైన వస్తువులను లాక్ చేసిన షెల్ఫ్ లలో ఉంచడం, అదనపు CCTV కెమెరాలు ఏర్పాటు చేయడం, సిబ్బందిని గమనించేలా నియమించడం.
⦿ ట్యాగింగ్ సిస్టమ్: కస్టమర్ల బ్యాగులకు బిల్లింగ్ కౌంటర్ దగ్గర తెరిచే ట్యాగ్‌లను ఉపయోగించడం.
⦿ టెక్నాలజీ: RFID ట్యాగ్ లు, స్మార్ట్ సెన్సార్ల వాడకం.
⦿ అవగాహన: దొంగతనం చేస్తే చట్టపరమైన పరిణామాల గురించి హెచ్చరికలను స్టోర్ లో ప్రదర్శించడం.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?