India’s Festive Travel Trends 2026: దసరా, దుర్గా పూజ, దీపావళి.. వరుస పండుగలతో అక్టోబర్, నవంబర్ నెలల్లో సెలవుల సందడి మొదలైంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని కొందరు భావిస్తుంటే, మరికొందరు కొత్త ప్రాంతాలను సందర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులు ఏయే ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారో అగోడా ట్రావెల్ ప్లాట్ ఫామ్ తాజా రిపోర్టును వెల్లడించింది. దేశీయంగా గోవా, పూరి, ఉదయ్‌పూర్ ముందుండగా.. విదేశీ ప్రయాణాల కోసం బ్యాంకాక్, ఫుకెట్, టోక్యో నగరాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ లో థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ టాప్ ప్లేస్ లో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ నగరం కోసం హోటల్ బుకింగ్ సెర్చ్ లు 65 శాతం పెరిగాయి. ఇక్కడి గ్రాండ్ ప్యాలెస్, వాట్ ఫో ఆలయం, లోకల్ ఫుడ్ మార్కెట్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్‌లోనే ఉన్న ఫుకెట్ కూడా భారతీయులకు మరో స్పెషల్ డెస్టినేషన్ కూడా. ఈ ప్రాంతం కోసం చాలా మంది సెర్చ్ చేశారు. బీచ్‌లు, సముద్ర అలలు, ప్రకృతి అందాలు ఆస్వాదించాలనుకునేవారికి ఫుకెట్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
జపాన్ రాజధాని టోక్యో గురించి కూడా చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో అక్కడి ఆకురాలే కాలం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ముఖ్యంగా షింజుకు గ్యోయెన్ లాంటి ఉద్యానవనాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపాన్ని చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు హనోయి సిటీ గురించి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. బీచ్‌లు, నైట్ మార్కెట్లు, చారిత్రక ప్రాంతాలు ఈ ప్లేసెస్ కు మంచి గుర్తింపు తీసుకొస్తున్నాయి. శ్రీలంకకు వెళ్లేందుకు కూడా చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. కొండ ప్రాంతాలు, పురాతన కట్టడాలు, బీచ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
భారత్‌లో పండుగ సెలవులకు వెళ్లేందుకు గోవా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 43 శాతం మంది ఎక్కువగా సెర్చ్ చేశారు. బీచ్‌లు, రిసార్టులు, ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ గోవాను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఒడిశాలోని పూరి మరో క్రేజీ డెస్టినేషన్ గా నిలిచింది. జగన్నాథ ఆలయ దర్శనం, సముద్రతీరం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. సరస్సులు, రాజభవనాలు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
చల్లని వాతావరణం, పచ్చని కొండలు ఇష్టపడేవారికి ఊటీ, మున్నార్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఊటీ కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మున్నార్ కోసం కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు వారణాసి కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆలయాలు, ఘాట్‌లు, గంగా హారతి పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి, ఈ పండుగ సీజన్‌లో భారతీయులు విదేశీ విహారాలతో పాటు దేశంలోని ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలపైనా ఆసక్తి చూపిస్తున్నారు.
Read Also: ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!