Foreign Couple India Train Travel: భారతీయ రైళ్లలో ప్రయాణం అంటే చాలామందికి గుర్తొచ్చేది రద్దీ, కిటికీ పక్కన సీటు, రైల్వే స్టేషన్ లో దొరికే ఫుడ్. కానీ, ఫస్ట్ ఏసీ కూపేలో ప్రయాణిస్తే ఆ ఎక్స్ పీరియెన్స్ మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. తాజాగా ఓ విదేశీ జంట ఇదే విషయాన్ని చెప్పింది. వీర్ భూమి ఎక్స్ ప్రెస్ లో రాత్రిపూట ప్రయాణించిన బ్రిటిష్ మహిళ కే, ఆమె టర్కిష్ పార్ట్ నర్ గోగో రైల్లో సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయారు. తమ అనుభవాన్ని యూట్యూబ్ వీడియోలో పంచుకున్నారు.
రైలులోకి ఎక్కిన వెంటనే ఆ జంట తమకు కేటాయించిన ప్రైవేట్ కూపేను చూసింది. అందులో విశాలమైన బెర్తులు, చక్కటి పరుపులు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, చదువుకోవడానికి లైట్లు, లగేజీ పెట్టుకునే ర్యాక్‌లు, అద్దం, కర్టెన్లు ఉన్నాయి. తాము గతంలో స్టే చేసిన కొన్ని హోటల్ గదుల కంటే ఈ కూపే పెద్దగా ఉందని కే చెప్పుకొచ్చింది. రైలులో ఇంత విశాలమైన ప్రైవేట్ ప్లేస్ ఉంటుందని ఊహించలేదని ఆశ్చర్యపోయారు.
ఆ జంటను మరింత ఆకట్టుకున్నది బాత్రూమ్. అందులో షవర్, సింక్, వాటర్ హీటర్ లాంటి సౌకర్యాలు ఉండటాన్ని గోగో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఇలాంటి సదుపాయాల గురించి ఆలోచించలేమన్నారు. వాటిని చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.
ప్రయాణంలో ఫుడ్ విషయంలోనూ వారికి ఓ క్రేజీ ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది. ఓ ఫుడ్ సెల్లర్ వారి కోచ్‌లోకి రూ.220 విలువైన డొమినోస్ పిజ్జాను తీసుకొచ్చాడు. రైలులోనే పిజ్జా కొనుగోలు చేయడం వారికి ఆశ్చర్యం కలిగించింది. దాన్ని రుచి చూసిన ఆ జంట, అద్భుతం అంటూ కామెంట్ చేశారు. గోగో ఇతర కోచ్‌లలో తిరుగుతూ తోటి ప్రయాణికులతో కూడా మాట్లాడాడు.
ఈ ప్రయాణం ఖర్చు కూడా వారిని ఆకట్టుకుంది. ఫస్ట్ ఏసీ కూపే టికెట్ ధర సుమారు 18 బ్రిటిష్ పౌండ్లు, అంటే దాదాపు రూ.2,300 అని గోగో వివరించాడు. బ్రిటన్‌లో సుదూర రైలు ప్రయాణాలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈ ధర చాలా తక్కువగా ఉందని పేర్కొన్నాడు.
వారు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇండోర్ చేరుకుంటామని భావించారు. అయితే, రైలు సుమారు 30 నిమిషాల ముందుగానే చేరుకోవడంతో సంతోషించారు. సౌకర్యవంతమైన బెర్తులు, ప్రైవేట్ కూపే, ఫుడ్ లాంటి అంశాలు తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చాయని తెలిపారు. ప్రయాణం ముగిసే సమయానికి రైలు దిగాలనిపించడం లేదని కూడా చెప్పారు. ఇక వీర్ భూమి ఎక్స్ ప్రెస్ (19315/19316) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్, ఉదయ్‌పూర్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
Read Also: ప్రకృతితో కలిసి ప్రయాణం.. భారత్ లో చూడాల్సిన 7 విస్టాడోమ్ రైల్వే రూట్స్ ఇవే!