The Engineering Behind Railway Tracks: ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలులో కూర్చున్నప్పుడు అది ఎంత బరువుతో ప్రయాణిస్తుందో చాలామంది ఆలోచించరు. వందల టన్నుల బరువున్న రైలు వేగంగా వెళ్తున్నా పట్టాలు ఎలా విరిగిపోకుండా ఉంటాయి? రైలు బరువును పట్టాలు ఎలా తట్టుకుంటాయి? దీని వెనుక ఉన్న ఆసక్తికర ఇంజినీరింగ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రైలు ప్రయాణించడానికి పట్టాలు మాత్రమే ఉంటే సరిపోదు. రైలులోని బరువును క్రమంగా కిందకు పంపిణీ చేసేలా మొత్తం వ్యవస్థను రూపొందిస్తారు. రైలు చక్రాలు పట్టాలపై పడే బరువును తీసుకుంటాయి. ఆ బరువు పట్టాల ద్వారా స్లీపర్లకు, అక్కడి నుంచి కింద ఉన్న రాళ్లు, మట్టితో పాటు మరింత లోపలికి వెళ్లేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బరువు ఒకే చోట పడకుండా విస్తరిస్తుంది. అందుకే రైలు బరువును పట్టాలు, వాటి కింద ఉన్న నిర్మాణం కలిసి తట్టుకునేలా చేస్తాయి.
రైలు చక్రాలు సాధారణ వాహనాల టైర్ల మాదిరిగా ఉండవు. అవి బలమైన ఉక్కుతో తయారవుతాయి. చక్రాల ఆకారం, వాటి అంచుల నిర్మాణం రైలు పట్టాలపై సురక్షితంగా ప్రయాణించడానికి సాయపడుతాయి. పట్టాలు కూడా సాధారణ ఇనుముతో తయారుచేసిన కడ్డీలు కావు. వీటిని రైళ్ల బరువు, వేగం, ప్రయాణించే మార్గంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. పట్టాల నాణ్యత, వాటిని కలిపే విధానం కూడా రైలు ప్రయాణ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి.
రైల్వే పట్టాల మధ్య, కింద కనిపించే చిన్న కంకర రాళ్లను బాలస్ట్ అంటారు. ఇవి అందం కోసం వేసినవి కావు. స్లీపర్లను స్టేబుల్ గా ఉంచడం, రైలు ప్రయాణ సమయంలో ఏర్పడే కంపనాలను తగ్గించడం, వర్షపు నీరు బయటకు వెళ్లేలా చేస్తాయి. ఈ రాళ్లు పట్టాలపై పడే బరువును విస్తరించడంలోనూ సహాయపడతాయి. రాళ్లు సరిగ్గా లేకపోయినా, పునాది బలహీనపడినా పట్టాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
రెండు పట్టాల కింద అడ్డంగా అమర్చిన కాంక్రీట్, ఇతర నిర్మాణాలను స్లీపర్లు అంటారు. ఇవి పట్టాల మధ్య సరైన దూరాన్ని కొనసాగించడంతో పాటు, చక్రాల నుంచి వచ్చే బరువును బాలస్ట్ కు పంపిణీ చేస్తాయి. స్లీపర్లు బలంగా ఉండటం రైలు సురక్షితంగా ప్రయాణించడానికి అవసరం.
రైల్వే సిబ్బంది పట్టాల పరిస్థితి, వాటి అమరిక, జాయింట్లు, స్లీపర్లు, పునాదిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. అవసరమైన చోట మరమ్మతులు చేస్తారు. అత్యాధునిక పరికరాలు, ప్రత్యేక యంత్రాలు కూడా ఈ పనుల్లో ఉపయోగిస్తారు. బలమైన రైలు పట్టాలపై ప్రయాణించడం వెనుక చక్రాలు, ఉక్కు పట్టాలు, స్లీపర్లు, బాలస్ట్ రాళ్లు, బలమైన పునాది కలిసి పనిచేస్తాయి. వీటన్నింటి సరైన నిర్వహణ వల్లే రైళ్లు ప్రతిరోజూ వేలాది కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నాయి.
Read Also: రైళ్లలో పెద్ద సౌండ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? అయితే, ఇక షాక్ తప్పదు!