Loud Phone Use on Trains: ట్రైన్ జర్నీలో మొబైల్ ఫోన్‌లో పాటలు వినడం, సినిమాలు చూడటం చాలామందికి అలవాటు. అయితే, ఇకపై ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా స్పీకర్ మోడ్ లో ఎక్కువ సౌండ్ పెట్టి వినడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
రైళ్లలో మొబైల్ ఫోన్లను స్పీకర్ మోడ్‌లో పెట్టి పాటలు వినడం, సినిమాలు చూడటం, సోషల్ మీడియా రీల్స్ ను ఎక్కువ సౌండ్ పెట్టి వినడం మానుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ముఖ్యంగా ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు కామ్ గా ఉండేందుకు ఇష్టపడుతారు. అలాంటి సమయంలో పెద్ద సౌండ్ తో వీడియోలు చూడటం, ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు. అందుకే, ఫోన్ వాడాలనుకునే వాళ్లు తప్పనిసరిగా ఇయర్ ఫోన్స్ లేదంటే హెడ్ ఫోన్స్ ఉపయోగించాలన్నారు. కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలన్నారు.
రైల్వే చట్టంలోని సెక్షన్ 145కు సంబంధించిన నిబంధనలను ప్రస్తావిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్పీకర్ మోడ్‌లో ఫోన్ వాడటం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా గట్టిగా మాట్లాడటం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనలను పాటించని వారిని రైల్వే పరిసరాల నుంచి బయటకు పంపించడంతో పాటు రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రైల్వే అధికారి హెచ్చరించిన తర్వాత కూడా అదే విధంగా ఇబ్బంది కలిగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆరు నెలల వరకు సాధారణ జైలు శిక్ష లేదంటే రూ.5,000 వరకు జరిమానా విధించనున్నారు. ఒక్కోసారి రెండూ విధించవచ్చని హెచ్చరించారు.
రైళ్లలో కొందరు ప్రయాణికులు హెడ్‌ఫోన్స్ లేకుండా సినిమాలు, టీవీ సీరియళ్లు, సోషల్ మీడియా వీడియోలు చూస్తున్నారని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. చిన్నపిల్లలకు కార్టూన్లు చూపించేటప్పుడు కూడా పెద్ద శబ్దంతో వీడియోలు ప్లే చేయడం వల్ల కోచ్‌లోని ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
రైలు ప్రయాణంలో ఎవరైనా పదేపదే ఎక్కువ సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే, ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వవచ్చు. అలాగే రైల్ మదాద్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అన్నింటికంటే ముఖ్యం ప్రయాణంలో చిన్న జాగ్రత్తలు పాటిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఫోన్ లో ఆడియో వినేటప్పుడు ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం, కాల్స్ ను వీలైనంత తక్కువగా మాట్లాడ్డం మంచిది. ఇతరుల ప్రశాంతతను గౌరవించడం ద్వారా రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.
Read Also: ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!