Zero-Alcohol Policy for Loco Pilots: భారతీయ రైల్వేలో పనిచేసే లోకో పైలట్లు డ్యూటీ ఎక్కే ముందు వారి రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉండకూడదు. అయితే, మద్యం సేవించకపోయినా రక్త పరీక్షల్లో అతి తక్కువ స్థాయిలో ఆల్కహాల్ కనిపిస్తే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
2025 నవంబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో గెవ్రా–బిలాస్‌పూర్ మెము ప్యాసింజర్ రైలు నిలిచివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, సుమారు 20 మంది గాయపడ్డారు. లోకో పైలట్ గతంలో తప్పనిసరి ఆప్టిట్యూడ్ పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ, అతడిని మెము రైలు డ్యూటీ ఇచ్చినట్లు నివేదికలో ప్రస్తావించారు. ఈ ప్రమాదం తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆల్కహాల్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
రైళ్లలో విధులు నిర్వహించిన సిబ్బందికి చేసిన బ్రీతలైజర్ పరీక్షల్లో ఆల్కహాల్ లేదని తేలింది. అయితే, రక్త నమూనాలను ప్రయోగశాలల్లో పరీక్షించగా ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 3 నుంచి 10 మిల్లీగ్రాముల వరకు ఇథనాల్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ స్థాయి ఆల్కహాల్‌ను ఎలా పరిగణించాలనే ప్రశ్న తలెత్తింది. రైల్వే నిబంధనల ప్రకారం సిబ్బంది రక్తంలో ఆల్కహాల్ స్థాయి సున్నాగా ఉండాలి. కానీ, అతి తక్కువ స్థాయిలను పరీక్షించే విషయంలో ప్రయోగశాలల సామర్థ్యంపై వైద్య అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు.
భారతీయ రైల్వే మెడికల్ మాన్యువల్‌లోని 565 పేరా ప్రకారం, రైళ్లలో పనిచేసే సిబ్బందికి రక్తంలో ఆల్కహాల్ ఉండకూడదు. 2001లోనూ రైల్వే బోర్డు ఈ నిబంధనను స్పష్టం చేసింది. అయితే, కొన్ని ప్రయోగశాలలు 3 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఆల్కహాల్ స్థాయిని కచ్చితంగా గుర్తించలేకపోతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు, మద్యం సేవించకపోయినా శరీరంలోని జీవక్రియ సంబంధిత కారణాలతో రక్తంలో స్వల్పంగా ఇథనాల్ కనిపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని CRS రైల్వే బోర్డుకు సూచించింది.
ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కూడా నిబంధనలను పునఃపరిశీలించాలని కోరుతోంది. మద్యం సేవించని సిబ్బంది రక్త పరీక్షల్లో తక్కువ స్థాయిలో ఆల్కహాల్ కనిపించినంత మాత్రాన వారిపై చర్యలు తీసుకోవడం సరికాదని సంఘం అభిప్రాయపడుతోంది. అయితే, రైలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆల్కహాల్ పరీక్షల్లో కచ్చితత్వం చాలా ముఖ్యం. పరీక్షల ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి, సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Read Also: ప్రకృతితో కలిసి ప్రయాణం.. భారత్ లో చూడాల్సిన 7 విస్టాడోమ్ రైల్వే రూట్స్ ఇవే!