E-Paper
Advertisement

పనిచేయనప్పుడు పదవులెందుకు.. బీజేపీ నేతలకు బన్సల్ వార్నింగ్?

పనిచేయనప్పుడు పదవులెందుకు.. బీజేపీ నేతలకు బన్సల్ వార్నింగ్?
Advertisement

Sunil Bansal: స్వేచ్ఛ బ్యూరో: పార్టీ పదవుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయని నేతలపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాధ్యతలు నిర్వహించలేనప్పుడు పదవుల్లో కొనసాగడం ఎందుకని, సమర్థంగా పనిచేసే ఇతరులకు వాటిని అప్పగిస్తే మంచిదని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ఆయన.. హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయానికే పరిమితం కాకుండా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల స్థాయికి వెళ్లి పనిచేయాలని నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా తెలంగాణకు వచ్చిన బన్సల్‌.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పదాధికారులతో సమావేశమై సంస్థాగత పరిస్థితులు, నాయకుల పనితీరు, రానున్న ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించినట్లు సమాచారం.

హైదరాబాదే తెలంగాణ కాదు..

Advertisement

తెలంగాణ అంటే హైదరాబాద్‌ ఒక్కటే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను విస్తరించాల్సిన అవసరం ఉందని బన్సల్‌ పేర్కొన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం చుట్టూ తిరుగుతూ సమావేశాలు, కార్యక్రమాలతో కాలం గడిపితే సరిపోదని, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, స్థానిక సమస్యలపై దృష్టి సారించి పార్టీని ప్రజలకు చేరువ చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇకపై తాను తెలంగాణలోనే ఉంటూ పార్టీ వ్యవహారాలను నిశితంగా పరిశీలించనున్నట్లు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతల పనితీరుపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేసి తమ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పనిచేసుకోవాలని బన్సల్‌ సూచించినట్లు తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నవారు ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ పదవులు నిర్వహిస్తున్నవారు వాటికి తగిన సమయం కేటాయించి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని, అలా చేయలేని పక్షంలో ఇతరులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. పదవులు పొందడమే కాకుండా వాటి ద్వారా పార్టీకి ఎంత ప్రయోజనం చేకూరుస్తున్నారన్నది కూడా ముఖ్యమనే సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చాయ్ పే చర్చ లతో ప్రజల్లోకి వెళ్లండి

Advertisement

భారీ బహిరంగ సభలు, మైకులు, హంగామాతో కూడిన కార్యక్రమాలపై అధికంగా ఆధారపడకుండా ప్రజలతో నేరుగా మమేకం కావాలని బన్సల్‌ సూచించినట్లు సమాచారం. నాయకులు పెద్ద సభల్లో ప్రసంగించడం కంటే చిన్నచిన్న సమూహాల వద్దకు వెళ్లి స్థానికులతో మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో చాయ్‌ పే చర్చ లాంటి కార్యక్రమాల ద్వారా గ్రౌండ్ స్థాయికి వెళ్లి ప్రజలకు చరువా కావాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నలుగురితో కలిసి చాయ్‌ తాగుతూ మాట్లాడినా ప్రజలతో అనుబంధం పెరుగుతుందని, వారి సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుందని అభిప్రాయపడినట్లు సమాచారం. అనవసర ఆర్భాటాలను తగ్గించి ప్రజలతో నిరంతర సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది.

బీజేపీ నేతలకు బన్సల్ దిశానిర్దేశం

పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంలో నేతలు మరింత చొరవ చూపాలని బన్సల్‌ పేర్కొన్నట్లు సమాచారం. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే దాని ప్రయోజనం ఏమిటన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు వాస్తవాలు, ఆధారాలతో సమాధానం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఆరోపణలపై స్పందించడంలో జాప్యం చేయకుండా, ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాల ప్రచారంతోపాటు వాటి ఫలితాలను ప్రజలకు చేరవేయడంపైనా దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. జెన్‌-జీ యువతలో తలెత్తుతున్న ఉద్యమాలు, వివిధ అంశాలపై వ్యక్తమవుతున్న అభిప్రాయాల నేపథ్యంలో యువతతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని బన్సల్‌ సూచించినట్లు తెలిసింది. సెమినార్లు, చర్చా కార్యక్రమాల ద్వారా ఆయా అంశాలకు సంబంధించిన వాస్తవాలను వివరించాలని, యువతలో అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నట్లు సమాచారం. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతోపాటు వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరాన్ని వివరించినట్లు తెలిసింది.

క్షేత్రస్థాయికి వెళ్లండి.. లేదంటే పదవులు వదులుకోండి

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రాధాన్యంగా తీసుకోవడంతోపాటు రానున్న ఎన్నికలన్నింటికీ పకడ్బందీగా సిద్ధం కావాలని బన్సల్‌ సూచించినట్లు సమాచారం. అర్హులైన ఓటర్ల నమోదు, పార్టీ సంస్థాగత బలోపేతం, నియోజకవర్గాల వారీగా కార్యాచరణ రూపకల్పనపై నేతలు దృష్టి సారించాలని పేర్కొన్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు నాయకుల క్షేత్రస్థాయి పనితీరే కీలకమని బన్సల్‌ తన తొలి పర్యటనలో స్పష్టం చేసినట్లు సమాచారం. పదవుల నిర్వహణ, ప్రజలతో సంబంధాలు, పార్టీ కార్యక్రమాల ప్రచారం, ఎన్నికల సన్నద్ధత.. ఈ నాలుగు అంశాలపై నేతలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా రానున్న రోజుల్లో నాయకుల పనితీరును పరిశీలించడంతోపాటు సంస్థాగత వ్యవహారాలపై సమీక్షలు కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: తెలంగాణను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

Tags

Related News

ఫీజు బకాయిలు ఇవ్వరు కానీ లక్షల ఫైన్లా? ఇంటర్ బోర్డు వైఖరిపై ప్రైవేట్ కాలేజీల సంఘం ఆగ్రహం!

తెలంగాణను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

పోలీస్‌ వేలు కొరికి.. నడిరోడ్డుపై బట్టలిప్పేసి.. ర్యాపిడో డ్రైవర్ నానా హంగామా!

బాసర ట్రిపుల్ ఐటీపై ఎల్‌నినో‌ ఎఫెక్ట్.. దసరా సెలవుల పొడిగింపు, ఆన్ లైన్ క్లాసులు కంటిన్యూ

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

ఆఫీస్‌లో నీచమైన పని.. బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియోలు తీసిన అటెండర్!

Big Stories

Advertisement
×