Srinagar Airport: ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండైన తర్వాత పార్కింగ్ ప్లేస్‌లో నిలుపుతుండగా విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్స్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటన సమయంలో విమానంలో ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదని సదరు సంస్థ వెల్లడించింది.
శుక్రవారం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత పార్కింగ్‌లో నిలుపుదల చేస్తుండగా విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్స్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన ఇండిగో 6E 225 (VT-NOG) నెంబరు విమానం నవీ ముంబై నుంచి శ్రీనగర్‌కు వెళ్లింది. ఎయిర్‌పోర్టులోని బే నెం. 6 వద్ద పార్కింగ్ చేస్తుండగా ఉదయం 9.02 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఘటన తర్వాత విచారణకు ఆదేశించినట్లు సదరు సంస్థ వెల్లడించింది.
ప్రమాదం సమయంలో విమానంలో ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలోని మాన్యువల్ మెట్ల సహాయంతో ప్రయాణీకులను సురక్షితంగా కిందకు దించారు. ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. ఈ దశలో ఘటనకు సంబంధించి ఎలాంటి నిర్ధారణకు రాలేమన్నారు. ఘటన తర్వాత ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ALSO READ: రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు
గడిచిన 24 గంటల్లో ఇండిగో విమానానికి సంబంధించి ఇది రెండో ఘటన. గురువారం పైలట్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో దోహా-బెంగళూరు ఇండిగో విమానాన్ని మస్కట్‌కు మళ్లించారు . అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో విమానాన్ని దారి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై విచారణ జరుపుతామని దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. విమానాన్ని దారి మళ్లించడానికి కారణమైన పైలట్‌కు అసలు ఏమి జరిగిందనే దానిపై ఆ సంస్థ వివరాలు అందించలేదు. విమానం దిగిన వెంటనే సదరు సిబ్బందికి వైద్య బృందం చికిత్స అందించారు. బెంగళూరుకు ప్రయాణాన్ని కొనసాగించడానికి కొత్త సిబ్బందితో కూడిన ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్టు ఇండిగో సంస్థ పేర్కొంది.
BIZARRE…WHAT ARE THE CHANCES…?
A passenger aircraft hit a pole while landing at Srinagar Airport. Airport authorities are gathering details of the incident. A statement will be issued shortlyAll passengers are safe, no injuries to anyone. pic.twitter.com/P2gm0daw1G
— Rahul Shivshankar (@RShivshankar) September 4, 2026