మీ రైలు ప్రయాణం సాఫీగా సాగాలంటే.. మీ చుట్టుపక్కల పరిస్థితులు కూడా బాగుండాలి. ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. రైలులో ఎలాంటి అనుమానస్పద వస్తువు కనిపించినా వెంటనే రైల్వే పోలీసులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేకపోతే.. మీ ప్రయాణం చేదు అనుభవంగా మిగిలిపోతుంది. అయితే, ఇకపై మీరు కూర్చొనే సీటును కూడా చెక్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే.. సీటులో ఏం ఉందో చూసుకోకుండా కూర్చున్న ఓ ప్రయాణికుడికి సూది గుచ్చుకుంది. దీంతో అతడు భయంతో వణికిపోతున్నాడు. చిన్న సూదికేనా అని అనుకోవద్దు. ఆ సూది ప్రాణాలను హరించే ప్రమాదం ఉంది.
ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. అయితే, దీని గురించి మనం కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో రైలు ప్రయాణం చేసినప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇక అసలు విషయానికి వెళ్తే.. తైవాన్‌లో రైలెక్కిన ప్రయాణికుడికి సీట్లో కూర్చోగానే సూది గుచ్చుకుంది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. అయితే, అతడు మౌనంగా ఆ విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. వెంటనే బన్కియావో (Banciao) స్టేషన్‌లో రైలు దిగిపోయి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించాడు. ఈ ఘటనపై స్పందించిన తైవాన్ రైల్వే కార్పొరేషన్ (TRC) చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. రైల్లో అనుమానస్పద వస్తువులు కనిపిస్తే.. వాటిని తాకకుండా వెంటనే తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించింది.
ఈ ఘటనపై తైపీ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తోంది. సీటులోకి సూది ఎలా వచ్చింది? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పెట్టారా? లేక మరేదైనా కారణమా? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా రైలులోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!
చిన్న సూదిగా ఇంత హడావిడి ఎందుకు అనే సందేహం మీకు రావచ్చు. కొందరు ఈ సూదులను ఉద్దేశ పూర్వకంగా పెడుతుంటారు. ప్రయాణికులు గాయపడుతుంటే చూసి ఆనందించడానికి లేదా, ఎయిడ్ వంటి ప్రమాదకర రోగాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఇలాంటి ఆకతాయి పనులు చేస్తుంటారు. అందుకే, ఆ ప్రయాణికుడు కూడా సూది గుచ్చుకోగానే ఆందోళనకు గురయ్యాడు. సోషల్ మీడియా ద్వారా తన భయాన్ని వ్యక్తం చేశాడు. ఆ సూది పెట్టినవారి ఆచూకీ దొరికితే.. అది పొరపాటున జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది తెలుస్తుంది. అలాగే.. ఆ సూదికి ఎలాంటి కెమికల్స్ లేదా ఇతరుల రక్తం పూసి లేదని తెలిస్తే.. ఆ ప్రయాణికుడికి గండం గడిచినట్లే.