Ghost Houses: జపాన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వినూత్నమైన, విచిత్రమైన ఉపాధి మార్గం వెలుగులోకి వచ్చింది. దెయ్యాలు, భూతాల భయంతో ఖాళీగా పడివున్న బంగ్లాలు, ఇళ్లల్లో రాత్రివేళల్లో నిద్రించడానికి భయపడని వ్యక్తులను యజమానులు అద్దెకు తీసుకుంటున్నారు. అక్కడ ఎటువంటి ఆత్మలు లేవని నిరూపించడమే ఈ పని ముఖ్య ఉద్దేశం. ఒక్క రాత్రి ఆ ఇంట్లో గడిపినందుకు గాను రూ.52,000 (సుమారు 88,000 యెన్లు) వరకు చెల్లిస్తుండటం విశేషం.
జపాన్‌లో భయంకరమైన నేపథ్యం ఉన్న ఇళ్లను ‘జికో బుక్కెన్’ అని పిలుస్తారు. ఇంట్లో ఎవరైనా హత్యకు గురైనా, ఆత్మహత్య చేసుకున్నా, వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటూ మరణించినా అటువంటి ఆస్తులను ఈ కేటగిరీలో చేరుస్తారు. అయితే ఇలాంటి ఇళ్లను కొనడానికి, అద్దెకు దిగడానికి స్థానికులు భయపడుతుంటారు.
ఈ సమస్యకు పరిష్కారంగానే ‘ఘోస్ట్ సిట్టర్స్’ రంగంలోకి దిగుతున్నారు. వీరు ఆయా ఇళ్లలో అధునాతన కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలతో ఒక రోజంతా రాత్రివేళల్లో గడుపుతారు. ఆ సమయంలో ఎలాంటి విచిత్ర సంఘటనలు లేదా పారానార్మల్ కార్యకలాపాలు జరగలేదని నిర్ధారించుకున్నాక ఆ ఇల్లు సురక్షితమైనదని ఒక ‘సర్టిఫికేట్’ జారీ చేస్తారు. ఒకవేళ వీరు సర్టిఫికేట్ ఇచ్చాక కూడా ఏదైనా దెయ్యం, భూతం ఉన్నట్లు రుజువైతే కొన్ని ఏజెన్సీలు నష్టపరిహారం కూడా చెల్లిస్తామని ఆఫర్ ఇస్తుండటం విశేషం.
జపాన్‌లో శరవేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా, తగ్గుతున్న జననాలు, నగరాలకు వలసల కారణంగా లక్షలాది ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అందులోనూ ‘జికో బుక్కెన్’ ఇళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా పడి ఉండటంతో యజమానులు వాటి ధరలను సాధారణ మార్కెట్ కంటే 20 నుండి 50 శాతం వరకు తగ్గించి అమ్ముతున్నారు.
Also Read: అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!
ప్రస్తుతం ఆస్తి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మూఢనమ్మకాల కంటే ఆర్థిక స్థోమతకే జపాన్ యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. భయాలను పక్కనబెట్టి, సగం ధరకే దొరుకుతున్న ఈ ఇళ్లను సొంతం చేసుకోవడానికి అక్కడి వారు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పాత ఇళ్లల్లో భయాలను పొగొట్టేందుకు ఘోస్ట్ హంటర్స్ కు అక్కడ డిమాండ్ పెరిగిపోతోంది. పైగా పెద్ద మెుత్తంలో డబ్బు ఇస్తానని ఆఫర్ చేస్తుండటంతో నిరుద్యోగ యువత.. ఘోస్ట్ హంటింగ్ వైపు మెుగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?