New Yamaha Electric Scooter Design Leaked: యమహా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి అడుతు పెట్టబోతోంది. తాజాగా ఈ స్కూటర్‌కు సంబంధించిన డిజైన్ రిజిస్ట్రేషన్ వెలుగులోకి వచ్చింది. ఈ మోడల్ అధికారికంగా విడుదల కాకపోయినా, రిజిస్ట్రేషన్ ద్వారా కొన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్‌ను బట్టి చూస్తే, ఇది ప్రొడక్షన్ కు సిద్ధంగా ఉన్న మోడల్ లా కనిపిస్తోంది.
కొత్త స్కూటర్ లుక్ పరంగా యమహా Ray ZR 125 లాగే కనిపిస్తోంది. అయితే, మెకానికల్ సెటప్ లో మాత్రం కంపెనీ కొత్త అంశాలను జోడించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మోటార్ ను రియర్ వీల్ దగ్గర యాడ్ చేస్తారు. కానీ, ఈ కొత్త మోడల్‌లో మోటార్‌ను స్కూటర్ మధ్య భాగంలో అమర్చి, బెల్ట్ డ్రైవ్ ద్వారా వీల్ కు పవర్ అందించేలా రూపొందించారు. దీంతో స్కూటర్ పనితీరు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ స్కూటర్‌లో బ్యాటరీని సీటు కింద అమర్చారు. డిజైన్ ను పరిశీలిస్తే, అవసరమైతే బ్యాటరీని సులభంగా తీసి మార్చుకునే అవకాశం కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీకి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని యమహా ఈ ఫీచర్‌ను అందించే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక సస్పెన్షన్ సెటప్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ట్విన్ షాక్ అబ్జార్బర్లను సాధారణ స్థానానికి భిన్నంగా స్వింగ్ ఆర్మ్ ముందు భాగంలో అమర్చారు. అంతేకాదు, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్, ముందు, వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇవ్వనున్నట్లు డిజైన్ ద్వారా తెలుస్తోంది. అలాగే పొడవైన సింగిల్ పీస్ సీటుతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించనుంది.
డిజైన్ పరంగా కూడా ఈ స్కూటర్ ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో V-ఆకారంలో ఉన్న LED డేటైమ్ రన్నింగ్ లైట్, దానికి ఇరువైపులా ప్రత్యేకమైన LED హెడ్ ల్యాంప్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో కూడా స్టైలిష్ LED టెయిల్ లైట్ కనిపిస్తోంది. ముందు ఆప్రాన్ లో చిన్న చిన్న స్టోరేజ్ పాకెట్లు, చిన్న TFT డిస్ ప్లే, కీలెస్ ఇగ్నిషన్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉండే అవకాశముంది.
ప్రస్తుతం యమహా గ్లోబల్ మార్కెట్లో నియోస్, ఏరోక్స్-E, EC-06 వంటి ఎలక్ట్రిక్ మోడళ్లను అమ్ముతుంది. తాజాగా లీక్ అయిన ఈ కొత్త స్కూటర్ పరిమాణం, డిజైన్‌ను బట్టి చూస్తే, దీనిని 125సీసీ స్కూటర్‌కు సమానమైన ఎలక్ట్రిక్ మోడల్గా తీసుకురావచ్చని తెలుస్తోంది. అలాంటి మోడల్ భారత మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. అయితే, ఈ స్కూటర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారు? ఏయే దేశాల్లో అందుబాటులోకి తీసుకువస్తారు? భారత మార్కెట్లో లాంచ్ చేస్తారా? లేదా? అనే అంశాలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆసక్తి నెలకొంది.
Read Also: విన్ ఫాస్ట్ డబుల్ సర్ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!