Anvesh’s Viral Video: ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ మరోసారి జనాలను పిచ్చోళ్లను చేశాడు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నంలోని భోగాపురం విమానాశ్రయానికి వస్తున్నట్లు చెప్పడంతో అతడి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, చివరకు తాను ఇండియాకు రావడం లేదని చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంతేకాదు.. జనాలను వెర్రోళ్లను చేయడానికే అలా చెప్పానంటూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
అన్వేష్ విదేశాల్లో పర్యటిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్ నుంచి బ్యాంకాక్‌కు వస్తున్నట్లు, అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేలా టికెట్లు తీసుకున్నట్లు చూపించాడు. దీంతో అతడు చాలా రోజుల తర్వాత ఇండియాకు తిరిగి వస్తున్నాడని అభిమానులు భావించారు. అన్వేష్ రాక కోసం ఎదురుచూస్తూ.. అతడిని నేరుగా కలవాలని చాలామంది అనుకున్నారు. కొందరైతే భోగాపురం విమానాశ్రయానికి చేరుకుని అతడి కోసం వేచి చూశారు. తమ అభిమాన యాత్రికుడిని ప్రత్యక్షంగా చూడొచ్చని ఆశపడ్డారు.
అయితే, అభిమానులు ఊహించినట్లుగా అన్వేష్ ఇండియాకు రాలేదు. తాను తను రిలీజ్ చేసిన వీడియోలో అసలు విషయం చెప్పాడు. ఇండియాకు రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నది నిజమేనని, వాటి కోసం సుమారు రూ.27 వేలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. అయితే, తనకు నిజంగా ఇండియాకు రావాలనే ఉద్దేశం లేదని చెప్పాడు. కేవలం ఎయిర్‌పోర్టు లాంజ్‌లోకి వెళ్లి తిరిగి వచ్చానని, జనాలను వెర్రోళ్లను చేయడానికే అలా చేసినట్లు చెప్పాడు. దీంతో అతడి అభిమానులు షాక్‌కు గురయ్యారు. నిజంగానే ఇండియాకు వస్తున్నాడని నమ్మిన తమను.. ఇలా ఆటపట్టించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అన్వేష్ అంతకుముందు షేర్ చేసిన మరో వీడియో కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇండియాకు రాలేకపోతున్నానని, దీపావళి సందర్భంగా వస్తానని చెప్పాడు. దీంతో ఈసారి అయినా అతడు భారత్‌కు తిరిగి వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ తాజాగా చేసిన కామెంట్స్ తో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ముందు ఒక మాట చెప్పి, ఆ తర్వాత మరోలా వ్యవహరించడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అభిమానులను ఇలా పదేపదే అయోమయానికి గురిచేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అన్వేష్ వస్తాడనే సమాచారంతో భోగాపురం విమానాశ్రయానికి వెళ్లిన అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది. అతడిని కలవాలని, ఫొటోలు దిగాలని ఆశించిన వారు అతడు రావడం లేదని తెలిసి వెనుదిరిగారు. కొందరు తమ సమయాన్ని వృథా చేసుకున్నామని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమ అభిమానాన్ని నమ్మకంగా తీసుకుని ఇలా ఆటపట్టించడం సరైంది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని పూర్తిగా నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: ఇండియాకు వచ్చేస్తానన్న అన్వేష్.. అదేదో ఆపరేషన్ అన్నావ్ ఏమైంది బ్రో అంటున్న నెటిజన్లు?