Portugal Wins Big at World Travel Awards 2026: యూరప్ ను సందర్శించాలని ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు పోర్చుగల్ మరోసారి బెస్ట్ డెస్టినేషన్ గా గుర్తింపు పొంది ఆహ్వానం పలుకుతోంది. వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ 2026లో పోర్చుగల్ కు యూరప్ లోని మోస్ట్ పాపులర్ ట్రావెల్ డెస్టినేషన్ అవార్డు లభించింది. అంతేకాదు, ఆ దేశ పర్యాటక సంస్థ విజిట్ పోర్చుగల్ కు కూడా యూరప్‌లోని ప్రముఖ పర్యాటక బోర్డు గుర్తింపు దక్కింది. బీచ్‌లు, చారిత్రక నగరాలు, ప్రకృతి అందాలు, అడ్వెంచరస్ ఈవెంట్స్ తో పోర్చుగల్ ఈ గుర్తింపు పొందింది.
వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ యూరోపియన్ వేడుక తాజాగా మాంటెనెగ్రోలోని హయత్ రీజెన్సీ కోటార్ బే రిసార్ట్ లో జరిగింది. ఈ అవార్డుల 33 ఏళ్ల చరిత్రలో మాంటెనెగ్రో తొలిసారిగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. ప్రపంచ పర్యాటక రంగంలో విశేష సేవలు అందిస్తున్న దేశాలు, నగరాలు, విమానయాన సంస్థలు, హోటళ్లకు ఈ అవార్డులను అందిస్తారు. పర్యాటక రంగ నిపుణులు, ప్రయాణికుల ఓటింగ్ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.
పోర్చుగల్ లోని పలు పర్యాటక ప్రాంతాలు కూడా ఈ వేడుకలో అవార్డులను సొంతం చేసుకున్నాయి. అల్గార్వే యూరప్‌లో ప్రముఖ బీచ్ డెస్టినేషన్ గా నిలవగా, లిస్బన్ ప్రముఖ సిటీ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. అజోర్స్ ప్రాంతానికి ప్రముఖ అడ్వెంచరస్ డెస్టినేషన్ అవార్డు దక్కింది. ఇక డార్క్ స్కై అల్క్వేవా యూరప్‌లోని ప్రముఖ పర్యాటక డెస్టినేషన్ గా ఎంపికైంది. ఇక్కడ రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాలను చూడటం, ఆస్ట్రోఫోటోగ్రఫీ వర్క్ షాప్‌లలో పాల్గొనడం, చీకట్లో కానోయింగ్ లాంటి ఈవెంట్స్ ను ఆస్వాదించవచ్చు. పోర్చుగల్ పర్యాటక రంగంలో క్వాలిటీ, వైవిధ్యం, కొత్త ఎక్స్ పీరియెన్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం తమ వ్యూహమని విజిట్ పోర్చుగల్ ప్రకటించింది.
ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన మాంటెనెగ్రో కూడా రెండు ముఖ్యమైన అవార్డులను గెలుచుకుంది. కోటార్‌కు యూరప్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రముఖ పర్యాటక గమ్యస్థానం గుర్తింపు లభించగా, మాంటెనెగ్రోకు ప్రముఖ ప్రకృతి పర్యాటక గమ్యస్థానం అవార్డు దక్కింది. చారిత్రక కట్టడాలు, ఏడ్రియాటిక్ సముద్ర తీరప్రాంతం, డర్మిటార్ నేషనల్ పార్క్ పర్వతాలు, తారా నది కాన్యన్ ఈ దేశంలోని ప్రధాన ఆకర్షణలుగా కొనసాగుతున్నాయి. అక్కడి హోటళ్లు, రిసార్టులకు కూడా పలు విభాగాల్లో అవార్డులు లభించాయి.
అటు ఈ ఏడాది అవార్డుల్లో టర్కిష్ ఎయిర్ లైన్స్ యూరప్ లో ప్రముఖ విమానయాన సంస్థగా నిలిచింది. ఏథెన్స్ కు సిటీ బ్రేక్ డెస్టినేషన్ అవార్డు, డిస్నీల్యాండ్ పారిస్ కు ప్రముఖ థీమ్ పార్క్ రిసార్ట్ గుర్తింపు లభించాయి. డుబ్రోవ్నిక్, మాడ్రిడ్, డబ్లిన్, కేన్స్ నగరాలు కూడా తమ తమ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి.
Read Also: 2 గంటల ఫ్లైట్ జర్నీ వద్దని.. 32 గంటలు రైల్లో ప్రయాణించిన కుటుంబం, ఎందుకో తెలుసా?