Saudi Arabia Security Alert: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఉంటున్న భారతీయులకు ఇండియన్ గవర్నమెంట్ కీలక సూచనలు చేసింది. అక్కడి పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, స్థానిక చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నది. ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్‌లను అడ్డుకుంటున్న దృశ్యాలను షూట్ చేయడం, వాటికి సంబంధించిన వీడియోలు, ఇతర సమాచారాన్ని సోషల్ మీడియాలో షూర్ చేయకూడదని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది.
సౌదీ అరేబియాపై వరుసగా క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు జరుగుతున్నాయి. అల్ అరబియా తాజా నివేదిక ప్రకారం.. 12 గంటల వ్యవధిలో సౌదీ వైమానిక రక్షణ దళాలు 11 బాలిస్టిక్ క్షిపణులు, ఒక క్రూయిజ్ క్షిపణి, రెండు డ్రోన్‌లను అడ్డుకున్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
సౌదీ అరేబియా తాజాగా జారీ చేసిన హెచ్చరికలను భారత రాయబార కార్యాలయం తమ పౌరులతో పంచుకుంది. క్షిపణులు, డ్రోన్‌లను అడ్డుకునే చర్యలు, అవి పడిన ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని సూచించింది. అలా చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించింది.
ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా భారత్-సౌదీ అరేబియా మధ్య విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. రియాద్, దమ్మామ్‌లకు వెళ్లే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులను నవంబర్ 7, 2026 వరకు నిలిపివేయనున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. జెడ్డాకు వెళ్లే విమాన సర్వీసుల నిలిపివేత అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపింది.
విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు జెడ్డా, మక్కాలోని 24 గంటల కంట్రోల్ రూమ్స్ ద్వారా సాయం అందిస్తున్నట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. అవసరమైన వారికి ఫుడ్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇతర నిత్యావసర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వీసాల గడువు, ప్రయాణ ఆలస్యాల సమస్యలపై సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
మరోవైపు, రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. అయితే, ప్రయాణికులు విమాన సంస్థల నుంచి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులు అధికారిక ప్రకటనలను గమనిస్తూ, భద్రతా సూచనలను పాటించాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.
Read Also: ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!