RTC – Auto Services: ప్రజా రవాణా వ్యవస్థను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో త్వరలోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ ఆటోలు పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి.
ప్రయాణికులు తమ ఇళ్ల నుంచి బస్ స్టాప్‌లకు చేరుకోవడానికి.. అలాగే బస్సు దిగిన తర్వాత తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి పడే ఇబ్బందులను తొలగించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. అందుకే ఆర్టీసీ దీనికి ‘ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ అని పేరు పెట్టింది. ఈ సేవల్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే.. ప్రయాణికులు బస్ టికెట్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆటో టికెట్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. మీరు ఉన్న ప్రాంతం నుంచే మిమ్మల్ని పికప్ చేసుకుని సమీప బస్ పాయింట్ వద్ద దించేందుకు.. అలాగే ప్రయాణం పూర్తయ్యాక దిగిన చోటు నుంచి మీ గమ్యస్థానానికి చేర్చేందుకు ఈ ఆటోలు అనుసంధానంగా పనిచేస్తాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ యాప్‌ల ఆటో ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోల ప్రయాణ ధరలు చాలా తక్కువగా ఉండేలా అధికారులు రూపకల్పన చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా వేగవంతమైన రవాణా సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
Also Read: విమానం కాదు.. ఆకాశంలో తేలే 5-స్టార్ హోటల్.. ప్రయాణికులకు లగ్జరీ రూమ్స్!
మొదటి దశలో ఈ ఈ-ఆటో సేవలను హైదరాబాద్ పరిధిలో ప్రారంభించనున్నారు. దీనివల్ల నగర శివారు ప్రాంతాలైన LBనగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, శంషాబాద్, శేరిలింగంపల్లి ప్రజలకు ఈ ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫలితాల ఆధారంగా, తదుపరి దశల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించాలని ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ బస్సులకు కనెక్టివిటీ పెరిగి.. ప్రయాణికుల అమూల్యమైన సమయం ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
Also Read: ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!