Ganesh Chaturthi 2026: దేశంలో హిందువులంతా ఒకచోట చేరి ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముందు వరుసలో ఉంటుంది. వీధులన్నీ రంగురంగుల పందిళ్లతో.. ఊరంతా గణనాథుడి పాటలతో మార్మోగుతుంటాయి. అయితే దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విభిన్న శైలిలో గణనాథుడ్ని పూజిస్తారు. అందులో 6 ప్రాంతాలు గణనాథుడి పండగ వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో కథనంలో చూద్దాం.
ముంబై లాల్‌బాగ్చా రాజాను దర్శించుకోకుండా గణేష్ చతుర్థి యాత్ర అసలు పూర్తికాదు. 1934లో ప్రారంభమైన ఈ లాల్‌బాగ్చా రాజా దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి కోట్ల మంది భక్తులు తరలివస్తారు. దీనికి తోడు ముంబైలోని ప్రభాదేవిలో ఉన్న ప్రసిద్ధ ‘సిద్ధివినాయక ఆలయం’ కూడా భక్తులతో పోటెత్తుతుంది. నగరం మొత్తం ఒక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది.
మహారాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను దగ్గరగా చూడాలనుకునే వారికి పుణే నగరం సరైన వేదిక. పుణే నగర నడిబొడ్డున కొలువుదీరిన ‘శ్రీమంత్ దగ్డుషేత్ హల్వాయ్ గణపతి’ ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. పండుగ సమయంలో ఇక్కడి వీధులన్నీ భక్తుల శోభాయాత్రలతో, కోలాహలంతో సందడిగా మారిపోతాయి.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ విగ్రహం ఎత్తు. ఈసారి కూడా ఇక్కడ అత్యంత ఎత్తైన పంచముఖ సంకటహర మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడ్ని దర్శించుకునేందుకు నగరవాసులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.
ఆర్భాటాల కంటే ప్రశాంతమైన ఆధ్యాత్మికతను కోరుకునే భక్తులకు ఏపీలోని కాణిపాకం ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని వినాయకుని విగ్రహం స్వయంభూగా (నీటిలో నుంచి తనకు తానుగా) వెలిసింది. గణేష్ చతుర్థి సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, బ్రహ్మోత్సవాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకోవాలనుకునే వారికి మహారాష్ట్రలోని గణపతిపులే అనువైన ప్రాంతం. కొంకణ్ తీర ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఈ స్వయంభూ గణపతి ఆలయం ఉంది. పండుగ వేళ ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ లభిస్తుంది.
Also Read: సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!
గోవా అనగానే చాలా మందికి బీచ్‌లు గుర్తుకొస్తాయి. కానీ అక్కడ గణేష్ చతుర్థిని ‘చోవోత్’ పేరుతో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగ చేసుకుంటారు. రకరకాల స్థానిక పండ్లు, కూరగాయలు, అటవీ ఉత్పత్తులతో ‘మాటోలి’ అనే అందమైన మంటపాన్ని అలంకరించడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్చు.
Also Read: భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!