Neem Toys: గుంటూరు జిల్లా అమరావతి పరిధిలోని రాయపూడికి చెందిన స్టాలిన్ ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపాడు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా, చిన్నారుల ఆరోగ్యానికి భద్రతనిచ్చేలా వేప కలపతో ఆట వస్తువులను తయారు చేస్తున్నాడు. తిరువనంతపురంలో ఎంటెక్ పూర్తి చేసి, కొన్నాళ్లు లెక్చరర్‌గా పని చేసిన స్టాలిన్.. విద్యార్థులకు క్లాసులు చెప్పేటప్పుడు బొమ్మలను వాడేవాడు. ఆ ఆలోచనే అతనికి ఈ బిజినెస్ ఐడియాను ఇచ్చింది. మొదట్లో చిన్నగా స్టార్ట్ చేసినా, మంచి రెస్పాన్స్ రావడంతో రాయపూడిలోనే పర్మినెంట్‌గా ఒక మేకింగ్ యూనిట్ సెట్ చేసుకున్నాడు.
ఇక్కడ చిన్న పిల్లల కోసం ఏకంగా వందకు పైగా రకాల బొమ్మలను తయారు చేస్తున్నారు. పజిల్స్, గిలక్కాయలు, పిల్లలు కొరికే బొమ్మలతో పాటు మేధో వికాసానికి పనికొచ్చే ఆట వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అసలు విశేషం ఏంటంటే.. వీటికి ఎలాంటి కెమికల్ కలర్స్ వాడరు. పిల్లలకి ఎక్కడా గుచ్చుకోకుండా, అంచులు చాలా స్మూత్‌గా ఉండేలా ఆధునిక మిషన్లతో వీటిని రూపుదిద్దుతున్నారు.
ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, పల్లెటూరి మహిళలకు భరోసా ఇస్తున్న మంచి ప్రయత్నం. మొదట్లో ఇద్దరు ముగ్గురితో మొదలైన ఈ ప్రయాణంలో ఇప్పుడు మొత్తం 22 మంది పనిచేస్తున్నారు. ఇందులో అచ్చంగా 20 మంది స్థానిక మహిళలే ఉన్నారు. వాళ్లందరికీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, బొమ్మల తయారీలో నిపుణులను చేశారు. రాబోయే రెండేళ్లలో కనీసం 100 మంది మహిళలకు ఉపాధి చూపడమే తన టార్గెట్ అని స్టాలిన్ చెబుతున్నాడు.
ఇప్పుడు ఈ ‘నీమ్ టాయ్స్’ కేవలం లోకల్ మార్కెట్‌కే పరిమితం కాలేదు. అమెజాన్‌తో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్, సొంత వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్ముతున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సపోర్ట్ ఉండటంతో పాటు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రదర్శనలోనూ ఈ బొమ్మలకు మంచి గుర్తింపు దక్కింది. అంతేకాదు, ఇంటర్నేషనల్ లెవెల్ పోటీల్లోనూ కొన్ని అవార్డులు కూడా సొంతం చేసుకున్నాయి.
Also read: అసలు ‘ఎంద చేట’ ఎలా పుట్టిందో తెలుసా? కృష్ణారెడ్డి చెప్పిన అసలు కథ!