AP DGP Warning: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర డీజీపీ అత్యంత కీలక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తిగా చట్టపరిధిలోనే జరుగుతుందని, హింసకు గానీ, బెదిరింపులకు గానీ ఎలాంటి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు, అభ్యర్థులు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఎన్నికల హింసపై కఠిన వైఖరి
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో 14 ఎన్నికల సంబంధిత ఘటనలు నమోదైనట్లు డీజీపీ వెల్లడించారు. పల్నాడు, కడప జిల్లాల్లో మూడేసి చొప్పున.. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండేసి.. తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో ఘటన వెలుగుచూశాయి. ఈ కేసుల్లో 17 మంది నిందితులను గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీలు, డ్రోన్లు, బాడీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నేరస్థులతో పాటు వారి వెనుకున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి భద్రత
అభ్యర్థులు ఎలాంటి భయం లేకుండా నామినేషన్లు వేసేలా కేంద్రాల వద్ద, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. నామినేషన్ కేంద్రాలను చుట్టుముట్టడం, బారికేడ్లను ఛేదించడం, రహదారుల దిగ్బంధం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రత్యర్థులను బెదిరించినా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా తక్షణమే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
నిబంధనల అమలు – పోలీసులకు సూచనలు
రాజకీయ ప్రచార సభలు, ర్యాలీలు, లౌడ్‌స్పీకర్ల వాడకం అంతా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడే ఉండాలని డీజీపీ సూచించారు. రాజకీయ అనుబంధాల ఆధారంగా ఎవరిపై బూటకపు కేసులు పెట్టబోమని, అలాగే తప్పు చేసిన వారిని రక్షించబోమని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని, బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత