Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాతావరణంలో పెను మార్పులకు కారణమవుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం.. శనివారం నాటికి వాయుగుండంగా, ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఆపై సోమవారం (అక్టోబరు 26) నాటికి ఇది పూర్తిస్థాయి తుఫానుగా రూపాంతరం చెందనుంది. కాగా ఈ తుఫాన్ కు బంగ్లాదేశ్ ‘అర్ణబ్’ (Arnab) పేరు సూచించింది. దీనికి సముద్రం అని అర్థం. రానున్న రెండు రోజుల్లో ఇది ఏపీ, ఒడిశా తీరాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
విశాఖ తుపాను హెచ్చరికల కేంద్ర సంచాలకులు పీఎల్‌ఎన్ మూర్తి అందించిన వివరాల ప్రకారం.. ఈ తుఫాను అక్టోబరు 28 నాటికి కాకినాడ – కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు ఏకంగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనున్నందున.. ఆదివారం నుండి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో శనివారం నుంచే ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణం మారుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. సోమవారం నుంచి కోస్తాంధ్రలో వానల జోరు మరింత పెరగనుంది. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అలాగే రాయలసీమ తూర్పు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, రైతులు, తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణపైనా ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతోందని వెల్లడించింది. పగటిపూట ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చలి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణం పగటిపూట ఎండగా.. సాయంత్రం, రాత్రిళ్లు ఆహ్లాదకరంగా ఉండనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం పూట తేలికపాటి పొగమంచు ఉన్నా.. మధ్యాహ్నానికి ఉక్కపోత పెరుగుతుందని తెలిపింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32°C నుంచి 34°C వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20°C నుంచి 22°C వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. సాయంత్రం వేళ నగర శివారు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉన్నా.. నగరంలో భారీ వర్షాలకు ఆస్కారం లేదని వాతావరణ వర్గాలు తెలియజేశాయి.