ఆంధ్రప్రదేశ్ లో టమాట, ఉల్లి రైతుల పరిస్థితి అధ్వాహ్నంగా తయారైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు పతనం అయ్యాయి. అష్టకష్టాలు పడి పండించిన పంటకు కనీస ధర రాకపోవడంతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. కొంత మంది రైతులు కనీసం కూలీ డబ్బులు కూడా రాకపోవడంతో పంటను తెప్పకుండా పోలాల్లోనే వదిలేస్తున్నారు. మరికొంత మంది రోడ్ల పక్కన పారబోస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి, మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద టమాట వాణిజ్య కేంద్రాలలో ఒకటైన పత్తికొండ మార్కెట్ యార్డ్ లో, టమాట ధర గత వారం కిలోకు రూ. 20 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ. 5 నుంచి రూ. 8కి పడిపోయింది. ఆగస్టు చివరి వారంలో టమాట రోజుకు 10 క్వింటాళ్లు వస్తే, ఆదివారం నాడు ఏకంగ 40 టన్నులకు పెరిగింది. పెద్ద మొత్తంలో సరుకు మార్కెట్ కు రావడం, ఇటీవలి వర్షాల కారణంగా తక్కువ నాణ్యత ఉండటం కారణంగా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రకు ఎగుమతి డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో కనీసం ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. 6,500 హెక్టార్లలో ఎకరానికి రూ.35,000-50,000 పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు కనీసం తెంపిన కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో పంటలను పూర్తిగా పొలంలోనే వదిలేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో హోల్ సేల్ ధర గత నెలలో క్వింటాలుకు రూ.2,000 ఉండగా, ఇప్పుడు ఆధర ఏకంగా రూ.300కి పడిపోయింది.
ఉల్లి రైతులు కూడా ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు. కర్నూలు మార్కెట్ కు రోజువారీ పంట 1,000 క్వింటాళ్లకు మించి రావడం, నాణ్యత లేకపోవడం, ఎగుమతి డిమాండ్ లేకపోవడంతో ధర పలకడం లేదు. మార్కెట్ అంతా ఉల్లిగడ్డల కుప్పలతో నిండిపోయింది. కిలో ధర రూ. 10 కూడా పలకడం లేదని అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటు టమాట, ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా ఈ పంటను సేకరించాలని కోరుతున్నారు. ఇప్పటికే MSP పథకం ద్వారా ఆగస్టు 31 నుంచి 20,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిపాయలను సేకరించింది. అన్నదాతలకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. సెప్టెంబర్ 13, 14 తేదీలలో మార్క్ ఫెడ్ సేకరించిన 1,500 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను క్వింటాల్ కు రూ. 30 నుంచి రూ. 900 వరకు వ్యాపారులకు వేలం వేశారు. అయితే, పంటకు జరిగిన నష్టం, తక్కువ నాణ్యత గల దిగుబడి కారణంగా ఉల్లిగడ్డలను గ్రేడింగ్ చేసే స్థితిలో తాము లేమని రైతులు చెప్తున్నారు. మెరుగైన సేకరణ వ్యవస్థలు, టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు, ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక వ్యూహాలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: నానో బనానాతో రూ.70 వేలు పాయే.. వీసీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్!