డిమార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా సుమారు 400 స్టోర్ల ద్వారా ప్రజలకు చౌక ధరలో అవసరమైన నిత్యవసరాలు, గృహోపకరణాలు, దుస్తులు సహా పలు రకాల వస్తువులను అందుబాటులో ఉంచుతుంది. సొంత బ్రాండ్ల ద్వారా మరింత తక్కువ ధరకే ఆయా సరుకులను వినియోగదారులకు అందిస్తుంది. పలు వస్తువుల మీద ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను మరింత ఆకట్టుకుంటుంది డిమార్ట్.
ఇక తాజాగా సైబర్ కేటుగాళ్లు డిమార్ట్ ను బేస్ చేసుకుని అమాయకులను బొల్తా కొట్టిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డిమార్ట్ వోచర్ల పేరుతో ఫిష్ లింక్ లు పంపించి, వారి అకౌంట్లలో ఉన్న డబ్బులను అందినకాడికి దోచుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం వాట్సాప్ కు ‘WhatsApp DM’ పేరులో ఓ లింక్ ను పంపిస్తున్నారు. ఈ లింక్ అచ్చం డిమార్ట్ పంపినట్లుగానే ఉంటుంది. రూ. 5000 డిమార్ట్ గిఫ్ట్ వోచర్ కావాలా? మీ కోసమే వేచి ఉందంటూ ఓ లింక్ ను పంపిస్తున్నారు. ఇది ఓ రకమైన డిజిటల్ స్కామ్. డిమార్ట్ పేరును ఉపయోగించి ప్రజలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరస్తులు పన్నిన కొత్త వ్యూహం.
ఇక డిమార్ట్ పేరుతో వచ్చిన లింక్ ను ఓపెన్ చేయడానికి మీకు Dmart తెలుసా?, మీ జెండర్ ఏంటి? డిమార్ట్ లో మీ షాపింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది? మీరు డిమార్ట్ నుంచి సరుకులు కొనాలి అనుకుంటున్నారా? అనే నాలుగు పశ్నలు అడుగుతారు. వాటికి సమాధానం చెప్పగానే.. అభినందనలు.. మీరు రూ. 5000 వోచర్ గెలుచుకున్నారు అంటూ మరో మెసేజ్ పంపిస్తారు. దానిని క్లిక్ చేయగానే అసలు కథ మొదలవుతుంది.
డిమార్ట్ పేరుతో వచ్చిన లింక్ ను క్లిక్ చేయగానే ఆ మెసేజ్ లోని లింక్ ను షేర్ చేయమని అడుగుతారు. లింక్ ను షేర్ చేయగానే మీ డేటాతో పాటు మీరు షేర్ చేసిన గ్రూప్ లోని వారు కూడా క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. వారి డేటా కూడా హ్యాక్ అవుతుంది. మీ మోబైల్ ట్రాకింగ్ సాఫ్ట్ వేర్, వైరస్ మీ మొబైల్ లోకి రావచ్చు. దీని కారణంగా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్ వర్డ్స్ సహా ఇతర సున్నితమైన సమాచారం హ్యాకర్లకు తెలిసిపోతుంది. ముఖ్యంగా డిమార్ట్ ను నగరాల నుంచి పట్టణాల వరకు ప్రజలు సులభంగా నమ్ముతారు కాబట్టి ఎక్కువ మంది క్లిక్ చేసి సైబర్ మోసాలకు గురవుతున్నారు. ఇలాంటి లింకుల విషయంలో పౌరులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అటు ఈ స్కామ్ పై డిమార్ట్ స్పందించింది. లింక్‌ల ద్వారా తాము ఎలాంటి ఆఫర్లు అందించడం లేదని వెల్లడించింది. డిమార్ట్ పేరుతో వచ్చే ఫిషింగ్ లింక్స్ క్లిక్ చేయడం, షేర్ చేయడం మానుకోవాలని తెలిపింది. సైబర్ మోసాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?