CM Progress Report: సంక్షేమ పథకాలు అందించడమే కాదు.. వాటిపై ప్రజలు ఏమేర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేది కూడా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. ఈ అంశంపై అధికారులు ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ వారంలో రాజధానితో పాటు పలు ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
08-09-2025 (సోమవారం) ( యూరియా సరఫరాపై రివ్యూ)
రాష్ట్రంలో యూరియా సరఫరా పరిస్థితి, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 వేల 503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని… మరో 10 రోజుల్లో 23 వేల 592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందన్నారు. ఈ నేపధ్యంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల కేటాయింపు అంశంపై సమీక్షలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేక్ ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు కేంద్రమంత్రి నడ్డా.
08-09-2025 (సోమవారం) ( ఉల్లి ధరపై రివ్యూ)
ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1200 కంటే తక్కువ ధరకు విక్రయిస్తే ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగు మందు డబ్బాతో ఆత్మహత్య డ్రామా ఆడిన వారిపై విచారణ చేస్తున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. పంటను కనీసం మార్కెట్‌కు తీసుకురాకుండా పురుగుమందు తాగినట్లు డ్రామా ఆడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
08-09-2025 (సోమవారం) (తురకపాలెం అంశంపై రివ్యూ )
తురకపాలెం గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. తురకపాలెం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్య శాఖ అధికారులు సైతం మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించారు.
08-09-2025 (సోమవారం) ( కీలక ఒప్పందం)
సీఎం చంద్రబాబు సమక్షంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థ, విశాఖపట్నం మహానగర పాలక సంస్థ అధికారులు రుణ ఒప్పందం పై సంతకాలు చేశారు. విశాఖపట్నంలోని మధురవాడ జోన్–2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ఈ రుణంతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి మొత్తం 553 కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో 498 కోట్లు ఐఎఫ్‌సీ రుణంగా ఇవ్వనుంది.అమృత్ 2.0 నుంచి 45.64 కోట్లు, జీవిఎంసీ సొంత నిధులు 9.36 కోట్లు దీనికి వినియోగించనున్నారు. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్‌సీకి చెల్లించనుంది. 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు 8.15 శాతంగా నిర్ణయించారు. త్వరలో మొదలయ్యే మధురవాడ మురుగునీటి ప్రాజెక్టుతో 100 శాతం అండర్‌గ్రౌండ్ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్-లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం, రీసైక్లింగ్ చేయనున్నారు.
08-09-2025 (సోమవారం) ( వియత్నాంతో ఒప్పందం )
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వియత్నాంతో ఒక కీలక ఒప్పందం కుదిరింది. విశాఖలో ఏపీ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వియత్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ చైర్మన్ చౌ ట్రీ యంగ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా, వియత్నాం పర్యాటకులు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, బొజ్జన్నకొండలు, బావికొండ, తొట్లకొండ వంటి బౌద్ధ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తారు.
09-09-2025 (మంగళవారం) ( సీఎంకు ఆహ్వానం)
ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా మహోత్సవాల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు అధికారులు, అర్చకులు. ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఆలయ అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ
09-09-2025 (మంగళవారం) ( GSDPపై రివ్యూ)
సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు సీఎం చంద్రబాబు. త్రైమాసిక ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న 17.1 శాతం వృద్ధి సాధించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ సగటును మించి 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్డీపీలో వృద్ధి నమోదైందని రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
09-09-2025 (మంగళవారం) ( ఏపీకి కీలక ప్రాజెక్ట్)
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 70 వేల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. ఈ ప్రాజెక్ట్‌కు త్వరలో శంకుస్థాపన జరగనుంది. ఈ కర్మాగారం మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనుండగా.. 20 వేల మందికి ఉపాధి లభించనుంది. దీనిపై భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక ప్రకటన చేశారు. ఈ ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయన్నారు. ఢిల్లీలో జరిగిన 6వ ఉక్కు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్యాక్టరీ శంకుస్థాపనపై క్లారిటీ ఇచ్చారు.
10-09-2025 (బుధవారం) ( సూపర్ సిక్స్.. సూపర్ హిట్.. )
అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 15 నెలల పాలనలో తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకే ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. 57 శాతం మంది ప్రజలు ఓట్లేశారని.. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని.. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా విపక్షంపై తీవ్రమైన విమర్శలు చేశారు.
10-09-2025 (బుధవారం) ( ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు)
ఆటో డ్రైవర్లకు దసరా కానుక ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏటా 15 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఆటో, క్యాబ్ యజమానులకు, డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్నవారు అందరికీ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సాయం చేయనున్నారు. పాత లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త దరఖాస్తులకు 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. క్షేత్ర పరిశీలన 22లోపు పూర్తిచేసి 24న తుది జాబితా సిద్ధం చేయనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు అక్టోబరు 1న డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు.
11-09-2025 (గురువారం) ( మానవత్వంతో ఆలోచించాలి )
పాలనలో జిల్లా కలెక్టర్లే కీలక బాధ్యత పోషించాల్సి ఉన్నందున నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా మానవీయ కోణంలో పని చేయాలన్నారు సీఎం చంద్రబాబు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన సందర్భంగా వారితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇస్తూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని.. మీరూ అదే పాటించాలన్నారు. అన్నింటికీ రూల్స్ కాదు.. మానవీయ కోణంలో పనిచేయాలని తెలిపారు. ఫేక్ ప్రచారాలు పెనుసవాల్ గా మారాయని రియల్ టైమ్‌లో కలెక్టర్లు స్పందించాలని సూచించారు.
11-09-2025 (గురువారం)
జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి నిర్వహణ, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, భూగర్భ జలాల స్థితిగతులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో మొత్తం 1,313 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుండగా ఇప్పటివరకు 1,031 టీఎంసీల నీటిని నిల్వ చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి సామర్ధ్యంలో 79 శాతం నీరు నిల్వ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వంశధారతో పాటు అన్ని ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని.. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం. హంద్రీనీవా కింద 19 నియోజకవర్గాల్లో ఉన్న చెరువుల్ని నింపాలని… డిస్ట్రిబ్యూటరీల పనులూ చేపట్టాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ ఏడాది 1,000 కోట్లు, వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లు ఇస్తామన్నారు. ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
12-09-2025 (శుక్రవారం) ( ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో సీఎం )
భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన సీ పీ రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
13-09-2025 (శనివారం)( ప్రజల సంతృప్తే ముఖ్యం )
ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్సుపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి రేటుకు చేరుకున్నామని అన్నారు. 2029 నాటికి జీఎస్డీపీ 29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
13-09-2025 (శనివారం) ( ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్ట్‌పై రివ్యూ)
తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర ఇతర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియచెప్పేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ఉండే అమరావతిని కూడా ప్రతిబింబించేలా ఉండాలన్నారు. 182 మీటర్ల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహ స్మృతివనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్‌ను తీర్చిదిద్దాలన్నారు. గుజరాత్‌లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
13-09-2025 (శనివారం) ( సరైన వ్యక్తి.. సరైన చోట.. )
జిల్లా ఎస్పీల బదిలీలపై సీఎం చంద్రబాబు నేరుగా వారితో సమావేశమయ్యారు. సరైన వ్యక్తి.. సరైన చోట ఉండాలనే లక్ష్యంతోనే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశామన్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్నవారు సమావేశానికి నేరుగా హాజరుకాగా మరి కొందరు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. నేరప్రవృత్తి, నేరాల తీరు మారినందున శాంతి భద్రతల పర్యవేక్షణ విధానం కూడా మారాలని సూచించారు. రాజకీయ ముసుగులో ఉండే నేరస్తుల్ని కఠినంగా అదుపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం ఆర్ధికంగా పురోభివృద్ధి సాధించాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తొలినాటి నుంచి శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చానని, అరాచకశక్తుల్ని, ముఠానాయకుల్ని, మతకలహాలు సృష్టించేవారిని నిర్దాక్షిణ్యంగా అదుపు చేసినందువల్లే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందని సీఎం వివరించారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అవసరానికి రౌడీలను, క్రిమినల్స్‌ను వాడుకునే వాళ్లు. అయితే నేడు రాజకీయాల ముసుగులోనే నేరాలు చేస్తున్నారన్నారు. పాలిటిక్స్‌ను క్రిమినలైజ్ చేశారని… వివేకా హత్య విషయంలో ఏం జరిగిందో ప్రతి పోలీసు అధికారి స్టడీ చేయాలన్నారు.
Also Read: మరో అల్పపీడనం ఎఫెక్ట్..!.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు..
13-09-2025 (శనివారం) ( ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం)
విశాఖ భవిష్యత్ అవసరాల కోసం భూమిని సమీకరిస్తోంది ప్రభుత్వం. దాదాపు 3 వేల ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. విశాఖపట్నానికి పెద్దఎత్తున కంపెనీలు వస్తుండటంతో వాటి ఏర్పాటు కోసం అవసరమైన భూములను సిద్ధం చేస్తున్నారు. 3 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆనందపురం, భీమునిపట్నం , పెందుర్తి, పద్మనాభం మండలాల పరిధిలో ఈ భూములను సమీకరించనున్నారు. వివిధ సంస్థల ఏర్పాటు కోసం ఇప్పటికే 200 ఎకరాల భూమిని కేటాయించారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భూ సమీకరణ చేపట్టనున్నారు.
Story By Vamshi Krishna, Bigtv