CM Progress Report: మొంథా సైక్లోన్.. ఏపీని అతలాకుతలం చేసిన ఈ తుఫాన్‌పైనే ఏపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు, రివ్యూలతో ఫుల్ బిజీగా ఉన్నారనే చెప్పాలి. ఇదే సమయంలో జరిగిన కాశీబుగ్గ తొక్కిసలాటతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు.
27-10-2025 ( సోమవారం ) ( రైల్వే ప్రాజెక్టులపై ఫోకస్ )
ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ కీలక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కొత్త రైల్వేలైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపడంపై చర్చ జరిగింది. నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు- గుంతకల్, గుణదల ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్- తుముకూరు మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుల పురోగతి సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- చెన్నై వయా అమరావతి మార్గాల్లో హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ల ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ఉండాలని సూచించారు. చెన్నై- బెంగళూరు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ కూడా తిరుపతిని కలుపుతూ వెళ్లాలన్నారు. ఖరగ్‌పుర్ నుంచి ఏపీ మీదుగా చెన్నై వరకూ నిర్మించతలపెట్టిన డెడికేటెడ్ రైలు రవాణా కారిడార్‌పైనా సీఎం దిశానిర్దేశం చేశారు.
27-10-2025 ( సోమవారం ) ( ప్రధానితో ఫోన్‌కాల్ )
నరేంద్ర మోడీ మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. అనంతరం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం సమీక్ష నిర్వహించారు.
28-10-2025 ( మంగళవారం) ( మొంథాపై కీలక నిర్ణయాలు)
మొంథా తుఫాన్‌పైనే సీఎం ఫుల్ టైమ్ ఫోకస్ చేశారు. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట, వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియచేయాలని సీఎం వారికి సూచించారు. మొత్తంగా మూడు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్ష చేయగా రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు.
28-10-2025 ( మంగళవారం) ( మర్యాదపూర్వక భేటీ )
సీఎం చంద్రబాబును ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా సాధికారత దిశగా కమిషన్ భవిష్యత్ ప్రణాళికను సీఎంకు వివరించారు. అదేవిధంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి వైద్యసాయం అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం పై మహిళా కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఆమె. సీఎం ఈ సందర్భంగా పలు అంశాలను ఆమెతో చర్చించారు.
28-10-2025 ( మంగళవారం) ( సీఎంకు ఆహ్వానం )
విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌కు హాజరు కావాల్సిందిగా సీఎం చంద్రబాబును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది. 2026 జనవరి 2 నుంచి 7 వరకు ఈ 36వ బుక్ ఎగ్జిబిషన్ జరగనుంది. సౌత్ ఇండియాలోని బుక్ పబ్లిషర్లు, ప్రింటర్లు, పాఠకులు పెద్దఎత్తున హాజరు కానున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అందరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేలా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించటంపై బుక్ ఫెస్టివల్ సొసైటీని సీఎం అభినందించారు.
28-10-2025 ( మంగళవారం) ( అప్రమత్తం చేయాలి )
మొంథా తుఫాను ప్రభావంపై లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాజా పరిస్థితిపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం లేకుండా, ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పునరావాస శిబిరాల్లో ఉండేవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకూ తుఫాన్ బులెటిన్ రిలీజ్ చేయాలని, మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలని, తప్పుడు సమాచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
28-10-2025 ( మంగళవారం) ( జిల్లాలపై సీఎం ఫోకస్ )
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమై వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు సీఎం. త్వరలో మరో సమావేశం నిర్వహించి మరింత లోతుగా అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం సూచించారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
29-10-2025 ( బుధవారం) ( ఏరియల్ సర్వే )
మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం నారా చంద్రబాబు. ఓడలరేవులోని తుఫాన్ పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న ఆయన.. తుఫాన్ కు నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించారు.. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి 20 వేల నుండి 30 వేల రూపాయల వరకు నష్టం ఉంటుందని రైతులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇది పెనువిపత్తు అని రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో తుఫాన్‌ల సమయంలో పనిచేసిన అనుభవం నాకుందన్న సీఎం.. మొంథా తుఫాన్‌పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకుని మొంథా తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చూశాం అన్నారు.
29-10-2025 ( బుధవారం) ( వరుస సమీక్షలు )
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. తుఫాన్ నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టం చేయాలన్నారు. రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించారని… రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 78,796 మంది రైతులకు చెందిన 59 వేలకు పైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించారని… రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించారని తెలిపారు. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. సత్వరమే స్పందించి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టామన్నారు. సచివాలయం సిబ్బంది, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో సహా అంతా కలిసి టీమ్ గా పనిచేశామని… కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు సీఎం.
30-10-2025 ( గురువారం) టీమ్ ఆంధ్రప్రదేశ్
మొంథా తుఫాన్ హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే దిశగా… సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీమ్ ఆంధ్రప్రదేశ్ పనిచేసింది. ఐదు రోజుల పాటు ఈ టీమ్ రాత్రి-పగలు తేడా లేకుండా పనిచేసింది. నిరంతరం మానిటర్ చేసుకోవడం… ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని.. ప్రజలను అలెర్ట్ చేయడం, నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి పునరావాసం కల్పించడం.. తుఫాన్ తగ్గాక సాధారణ పరిస్థితులు తీసుకురావడంపైఈ టీమ్ ఫోకస్ పెట్టింది.
30-10-2025 ( గురువారం) ( నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్ )
నైపుణ్యాభివృద్ధి శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం నైపుణ్యం పోర్టల్ ఉపయోగపడాలన్నారు. ఉద్యోగాల గేట్‌వేగా ఈ పోర్టల్ ఉండాలని సూచించారు. నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు సీఎం. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువ పత్రాలు జారీ చేయాలన్నారు.
30-10-2025 ( గురువారం) ప్రతి నెలా జాబ్ మేళాలు
ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో… క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి లోకేష్. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు సీఎం తెలిపారు.ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
31-10-2025 ( శుక్రవారం) ( కేంద్రానికి నివేదికలు)
మొంథా తుఫాన్ తదనంతర చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి 24 గంటల్లోగా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని తగు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మొంథా తుఫాన్‌తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని సీఎం అధికారులకు నిర్దేశించారు.
31-10-2025 ( శుక్రవారం) ( రాజధానిపై సమీక్ష)
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై.. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట సమయంలోగా భవనాల పనులు పూర్తి చేయాల్సిందేనన్నారు. నిర్మాణ పనుల్లో వేగంతోపాటు నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలన్నారు. పనుల పురోగతిపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై రైతులకు ఇబ్బందులు రాకూడదని తెలిపారు. ఇంకా 2 వేల 471 మంది రైతులకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ గారు, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
01-11-2025 ( శనివారం) పేదల సేవలో సీఎం
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో నిర్వహించిన పేదల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిపెన్షన్లు అంద చేశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో రెడ్డమ్మ అనే మహిళకు వితంతు పింఛను, మరో కుటుంబంలోని మేడా మల్లయ్యకు కళాకారుల పింఛను అందించారు. గ్రామస్తుల నుంచి వినతులు తీసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నారు.
01-11-2025 ( శనివారం) ( కాశీబుగ్గ ప్రమాదంపై రియాక్షన్)
ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆయన స్పందించారు. అంత పెద్ద తుఫానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని… తీరా చూస్తే ప్రైవేటు వ్యక్తుల బాధ్యతా రాహిత్య చర్యలతో ఇంత పెద్ద ప్రాణనష్టం జరగడం బాధకరమన్నారు. కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేదన్నారు.
Also Read: కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్.. విజయవాడ సబ్ జైలుకు తరలింపు
01-11-2025 ( శనివారం) ( ఫేక్ పార్టీలపై ఫైర్ )
ప్రజావేదిక నుంచి విపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. నేరస్థులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో నేరాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని… వారి జీవితమే ఫేక్ అన్నారు. అలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా ? అసలు వారికి పార్టీగా ఉండే అర్హత ఉందా ? అని ప్రశ్నించారు.
Story By Vamshi Krishna, Bigtv