తెలంగాణలోని రెండు కీలక రైలు మార్గాలను అభివృద్ధి చేసేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అవసరం అయిన రూ. 316 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆ మార్గాలు ఏవి? ఈ నిధులతో చేపట్టే పనులు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణలోని కీలక మార్గాలు అయిన మేడ్చల్-ముద్ఖేడ్, మహబూబ్ నగర్-ధోన్ సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.316 కోట్లను మంజూరు చేసింది. ఇది ఉత్తర, దక్షిణ భారతానికి అనుసంధానించే కీలకమైన తెలంగాణ మార్గాల్లో సామర్థ్యం, విశ్వసనీయత, రైలు వేగాన్ని పెంచుచనుంది. తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని చిన్న ప్రాంతాలను కవర్ చేసే మేడ్చల్-ముద్ఖేడ్, మహబూబ్ నగర్-ధోన్ సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేయడం ద్వారా మెరుగైన రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మేడ్చల్-ముద్ఖేడ్ సెక్షన్‌కు రూ.193.26 కోట్లు, మహబూబ్ నగర్-ధోన్ సెక్షన్‌కు రూ.122.81 కోట్లు ఖర్చవుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారుల ప్రకారం.. ఈ అప్ గ్రేడ్ లో సర్క్యూట్ బ్రేకర్లు, స్విచింగ్ స్టేషన్లకు మార్పులు చేయడం, అదనపు కండక్టర్ల ఇన్ స్టాలేషన్, విద్యుత్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. మేడ్చల్- ముద్ఖేడ్ మధ్య 225 రూట్ కి.మీ, మహబూబ్ నగర్- ధోన్ మధ్య 184 రూట్ కి.మీ విస్తరించి ఉన్న ఈ సింగిల్-లైన్ సెక్షనన్లు హైదరాబాద్, ఉత్తర, దక్షిణ భారతాలను అనుసంధానించే కీలకమైన లింకులను ఏర్పరుస్తాయి. ఈ మార్గాల విద్యుదీకరణ గతంలో మన్మాడ్-ముద్ఖేడ్-ధోన్ విద్యుదీకరణ ప్రాజెక్ట్ కింద పూర్తయింది. ఇది ప్రయాణీకుల, సరుకు రవాణా సజావుగా జరిగే అవకాశం కల్పించనుంది.
Read Also: ఏపీలో రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, ఇక ఆంధ్రా దశ తిరిగినట్టే!
ఇక అప్ గ్రేడ్ చేయబడిన ట్రాక్షన్ వ్యవస్థ అధిక రైలు వేగం, పవర్ వోల్టేజ్ స్థిరత్వం, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఒక సర్క్యూట్ ఫెయిల్ అయినప్పటికీ రైల్వే ఆపరేషన్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ అప్ గ్రేడ్ ద్వారా తక్కువ ట్రాక్షన్ సబ్ స్టేషన్లు అవసరమవుతాయి. ఆపరేషనల్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ప్రయాణీకుల, సరుకు రవాణా సేవలకు మెరుగైన అవకాశం కల్పించనున్నాయి.
Read Also: తొలిసారి ఆ మార్గంలో ఖాళీ రైళ్లను నడుపుకునేందుకు అనుమతి, రైల్వే కీలక నిర్ణయం!