Jogi Ramesh: ఏదైనా శాంతం వహించాలని పెద్దలు చెబుతారు. ఆవేశానికి వెళ్తే లేనిపోని అనర్థాలు, చిక్కుల్లో పడతాము కూడా. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఆయనతోపాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది.
చిక్కుల్లో జోగి రమేష్ ఫ్యామిలీ
సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో నేతలు జాగ్రత్తగా అడుగులు వేయాలి. తేడా వస్తే ఇమేజ్ డ్యామేజ్ కాదు.. కేసు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వుంటుంది. అఫ్‌కోర్సు అందుకు కారణాలు అనేకం కావచ్చు. లేటెస్టుగా మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో అదే జరిగింది.
ఏపీలో నకిలీ మద్యం కేసులో ఆదివారం ఉదయం ఆయన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి నుంచి నేరుగా ఎక్సైజ్ ఆఫీసుకు తరలించారు. విచారణ తర్వాత రాత్రి దాదాపు 12 గంటల సమయంలో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు
ఆసుపత్రికి అనుచరులతో కలిసి చేరుకున్నారు జోగి రమేష్ భార్య శంకుతల, కొడుకులు రాజీవ్, రోహిత్ లు. అయితే ఆసుపత్రి వద్ద జోగి రమేష్ మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ భారీగా నినాదాలు చేశారు. పోలీసు వాహనం ముందు బైఠాయించారు.
ఆవేశానికి లోనైనా జోగి మద్దతుదారులు ఆసుపత్రి క్యాజువాల్టీ వార్డు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు-జోగి రమేశ్ అనుచరులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు వైద్య పరీక్షల తర్వాత ఎక్సైజ్‌శాఖ అధికారులు ఆయన్ని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.
ALSO READ: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో జోగి రమేష్ ఫ్యామిలీ, అనుచరులపై కేసు నమోదు చేశారు. మరోవైపు నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ తోపాటు ఆయన సోదరుడు రాముకు ఈనెల 13 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఒకవేళ ఈ కేసులో ఆయన బయటకు వస్తే, ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టు చేయడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయ నేతలు ఓపిగ్గా ఉండాలని చాలామంది చెబుతారు బహుశా అందుకేనేమో!