BigTV English
Advertisement

TFI on Reviewers: తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా?

TFI on Reviewers: తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా?

కోట్ల రూపాయల ఖర్చు.. కొన్ని నెలల పాటు వందలాది మంది కష్టం.. ఎన్నో ఆటుపోట్లని దాటుకొని ఓ సినిమా వెండితెర దాకా వస్తే.. 3 గంటల్లో సినిమా చూసేసి.. 3 నిమిషాల్లో నెగటివ్ రివ్యూలు రాసేసి.. 3 రోజులకే ఆ సినిమా.. థియేటర్‌లో లేకుండా చేసేస్తున్నారనే వాదన.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డీటీఎస్‌లో వినిపిస్తోంది. నిజంగానే.. తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా? నిర్మాతల ఆక్రోశం, ఆగ్రహానికి అర్థముందా? సినిమాలను తొక్కేందుకు తెరవెనుక పనిచేస్తున్న శక్తులేంటి?


నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ కే- ర్యాంప్ ప్రొడ్యూసర్

టాలీవుడ్‌లో నడుస్తున్న లేటెస్ట్, హాటెస్ట్ ట్రెండ్ ఇదే! ప్రెస్ మీట్లలో, సక్సెస్ మీట్లలో, మూవీ ప్రమోషన్లలో.. కొందరు నిర్మాతలు వెళ్లగక్కుతున్న ఆక్రోశం చూశాక అర్థమవుతున్నది ఒక్కటే! రివ్యూలు.. తెలుగు సినిమాలను శాసిస్తున్నాయని! కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కొన్ని నెలల పాటు కష్టపడిన సినిమాకు.. ఎవరో ఎక్కడో కూర్చొని.. దానికి నెగటివ్ లేబుల్ అంటించేసి.. ఇంటర్నెట్, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసి.. సినిమాని కిల్ చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయ్. ఇందుకు.. లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయ్. ఇటీవలే.. కే-ర్యాంప్ మూవీ ప్రొడ్యూసర్ రాజేశ్ దండా.. తన కే-ర్యాంప్ మూవీపై.. ఓ వర్గం ఫేక్ ప్రచారం చేస్తోందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వెబ్‌సైట్‌ని ఉద్దేశించి.. స్టేజీ మీదే ఆగ్రహంతో ఊగిపోయారు. సినిమాని తొక్కాలని చూస్తున్నారని.. ఇలాంటోళ్లని నడిరోడ్డు మీద ఉరి తీయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మిత్రమండలి మూవీ నిర్మాత బన్నీవాసు

ఇటీవలే.. మిత్రమండలి మూవీ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. తనని తొక్కాలని చూస్తున్నారని.. వాళ్లెవరూ తన వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు. ఒక సినిమాని తొక్కేస్తే.. ఇంకో సినిమా ఆడుతుందనే భ్రమలు పనికిరావన్నారు. దాంతో.. బన్నీ వాసు సినిమాకు వ్యతిరేకంగా ట్రోలింగ్ చేయించిందెవరు? సినిమాని తొక్కేందుకు కుట్ర చేసిందెవరు? అంత అవసరం ఎవరికి ఉందనే చర్చ మొదలైంది.


నాగవంశీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా రివ్యూలపై రియాక్ట్

ఆ మధ్య ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఈ వెబ్ సైట్లు, సోషల్ మీడియా రివ్యూలపై రియాక్ట్ అయ్యారు. ఈ రివ్యూలే.. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్‌ని డిసైడ్ చేస్తున్నాయన్నారు. చివరికి.. బుక్ మై షో యాప్‌లో లైకులకు కూడా డబ్బులిస్తున్నామన్నారు. యూట్యూబ్‌లో ట్రైలర్లకు వ్యూస్ పెంచుతున్నామన్నారు. కొందరు రివ్యూయర్లని ఉద్దేశిస్తూ.. తన సినిమాకు ప్రమోషన్ చేయొద్దని, రివ్యూలు రాయొద్దని కోరారు. అప్పట్లో.. నాగవంశీ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయ్.

సినిమాకు పాజిటివ్ రివ్యూ చెప్పేందుకు డబ్బులు డిమాండ్

ఈ మధ్యకాలంలోనే.. ఓ యూట్యూబ్ రివ్యూయర్.. తమ సినిమాకు పాజిటివ్ రివ్యూ చెప్పేందుకు డబ్బులు డిమాండ్ చేశాడని.. వర్జిన్ బాయ్స్ మూవీ ప్రొడ్యూసర్ రాజా దారపునేని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేక్షకులు ఇలాంటి రివ్యూలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అప్పట్లో.. ఈ వ్యవహారం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా.. ఈ ఏడాదిలో.. ఈ రివ్యూల టాపిక్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. చిన్న సినిమాలు, కాస్త ఎక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాల విషయంలోనే ఇలా జరుగుతోంది. సినిమా రిలీజైన మొదటి రోజే వచ్చే రివ్యూలు, సోషల్ మీడియా, యూట్యూబర్లు, వెబ్ సైట్ రివ్యూలు.. ఆడియెన్స్‌ని బాగా ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళన నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. మంచి రివ్యూలు వస్తే.. మౌత్ టాక్ త్వరగా వ్యాపించి.. సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. నెగటివ్ రివ్యూలు వస్తే.. దాని ఎఫెక్ట్ భారీగా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. అది.. కలెక్షన్లను భారీగా దెబ్బతీసి, సినిమా ఫ్లాప్ అయి.. తామెంతో నష్టపోతున్నామని చెబుతున్నారు నిర్మాతలు. దీనిని అదునుగా చేసుకొని.. ఇండస్ట్రీలోనే కొందరు తమ సినిమాలను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని.. చిన్న నిర్మాతలు బహిరంగంగానే వేదికలపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. దాంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది.

నిర్మాతల ఆక్రోశం వెనుక అర్థముందా?

కొందరు రివ్యూయర్లు.. ముఖ్యంగా కొన్ని వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానెళ్లు.. సినిమాకు అనుకూలమైన రేటింగ్, రివ్యూ ఇచ్చేందుకు.. నిర్మాతల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే.. కావాలనే నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇంకొందరు రివ్యూయర్లు.. సినిమా చూడకుండానే, పబ్లిసిటీ కోసం అతి చేసి.. తప్పుడు సమాచారం, అనవసరమైన విమర్శలతో రివ్యూలు ఇస్తున్నారని.. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో నష్టం కలిగిస్తోందని.. నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లు.. కేవలం చిన్న సినిమాలపైనే దృష్టి పెట్టి, పెద్ద సినిమాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని.. దీని వల్ల తమకెంతో అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. డబ్బు కోసం పాజిటివ్ రివ్యూలు ఇచ్చేందుకు, ఇవ్వకపోతే.. నెగటివ్ రివ్యూలతో సినిమా వసూళ్లను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిని.. రివ్యూ మాఫియాగా చెబుతున్నారు. బెదిరించి.. తమను బ్లాక్‌మెయిల్ చేసిన వారిపై కొందరు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఏదేమైనా.. కొత్తగా రిలీజయ్యే సినిమా చూడాలా? వద్దా? అనే ఊగిసలాడే ఓ వర్గం ప్రేక్షకులపై మాత్రం.. ఈ రివ్యూల ఇంపాక్ట్ గట్టిగానే ఉందనేది మాత్రం వాస్తవం. అందువల్లే.. తాము నష్టపోతున్నామని చిన్న నిర్మాతలు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరు చుట్టేసి వస్తుందంటారు కదా! ఓ సినిమాకు వచ్చే రివ్యూలు కూడా అలాంటివే. ఆడియెన్స్ నుంచి జెన్యూన్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలోపు.. నెగటివ్ రివ్యూలు అన్ని ఏరియాలను చుట్టేసి వస్తున్నాయ్. అసలు.. తెలుగు సినిమాలను తొక్కుతున్నదెవరు? కంటెంట్ ఉన్న సినిమాలను నిలబెడుతున్నదెవరు? అసలు.. దీనంతటికీ కారణమెవరు? నిజంగానే.. రివ్యూ మాఫియా ఇండస్ట్రీని దెబ్బకొడుతోందా?

రివ్యూలు సినిమా ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుందా?

ఓ సినిమా హిట్ అవ్వాలన్నా.. ఫట్ అవ్వాలన్నా.. దానిని డిసైడ్ చేసేది.. పబ్లిక్ టాకే. అయితే.. ఇప్పుడు రివ్యూలు కూడా సినిమా ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుండటమే ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడుతుందోనే చర్చ జరుగుతోంది. వెబ్‌సైట్స్, మీమ్స్, ట్రోల్స్, హ్యాష్‌ ట్యాగ్స్.. ఇలా ప్రతీది.. సినిమా రిజల్ట్‌పై ఎంతో కొంత ఇంపాక్ట్ చూపుతున్నాయ్. వాస్తవానికి.. ఒకప్పటితో పోలిస్తే.. ఆరేడు ఏళ్ల నుంచే.. ఈ రివ్యూ ట్రెండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో.. సినిమా రివ్యూలు అంటే.. జస్ట్ ఓవర్సీస్ మార్కెట్‌ వరకే పరిమితమయ్యేవి. కానీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.. మూవీ రివ్యూలు, వెబ్‌సైట్లు, ట్రోలింగ్స్, మీమ్స్.. ఇలా అన్నీ ఓ మాఫియాలా క్రియేట్ చేయబడ్డాయి. కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ రివ్యూయర్లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్, మీమ్ పేజీలు.. ఇలా అంతా బ్లాక్ మెయిల్ చేసేదాకా వచ్చాయ్ పరిస్థితులు. వీళ్లలో.. కొందరిపై.. ఒకరిద్దరు నిర్మాతలు పోలీసు కేసులు కూడా పెట్టారు.

అయోమయానికి గురిచేస్తున్న పీఆర్ టీమ్‌లు

నిజం చెప్పాలంటే.. ఇండస్ట్రీలో పక్క సినిమాలను తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అపవాదు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రతివారం 4 నుంచి 6 సినిమాలు రిలీజవుతుంటాయ్. కొందరు ప్రొడ్యూసర్లు, హీరోలు.. తమ సొంత డిజిటల్ పీఆర్ సిస్టమ్‌తో.. ట్రైలర్లకు నెగటివ్ కామెంట్లు, డిస్‌ లైక్స్, IMDBలో రేటింగ్స్, బుక్ మై షో యాప్‌లో లైక్స్, రేటింగ్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా నెగటివ్ క్యాంపెయిన్, పెయిడ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లాంటివాటన్నింటికి.. డబ్బులిచ్చి మరీ పక్క సినిమాని తొక్కడం.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కామన్ అయిపోయిందనే చర్చ జరుగుతోంది. ఇంతేకాదు.. కొందరైతే ఫేక్ కలెక్షన్ పోస్టర్లు కూడా వేసి.. హీరో ఫ్యాన్స్‌ని, ప్రొడ్యూసర్లని, మూవీ టీమ్‌ని.. అయోమయానికి గురిచేస్తున్నారు. ఇదంతా.. కొన్ని పీఆర్ టీమ్‌లు ఆడుతున్న గేమే ఇదంతా అనే టాక్ వినిపిస్తోంది. కావాలనే.. ఇదంతా చేయిస్తున్నారని ప్రొడ్యూసర్లు అంటున్నారు. తమ సినిమాతో పాటు ఒకేవారం రిలీజయ్యే సినిమాని.. రేసులో లేకుండా చేసేందుకు.. అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. గతంలో.. నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు.. ఈ విషయాన్ని బాహాటంగానే మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈ రకమైన పీఆర్ సిస్టమ్‌తో.. హీరోలు, ప్రొడ్యూసర్లను.. మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.

సినిమా రివ్యూ రాసేందుకు డబ్బులు డిమాండ్

ఇక.. సినిమా రిలీజ్‌కు ముందు కనిపిస్తున్న హంగామా, ప్రమోషన్లు.. సినిమా రిలీజయ్యాక అస్సలు కనిపించట్లేదు. సినిమా రిలీజ్ తర్వాత జరిగే ప్రమోషన్లపైనా.. ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ సినిమాకు.. రిలీజ్ తర్వాత పెద్దగా ప్రమోషన్ ఉండటం లేదు. కొన్ని వెబ్‌సైట్లు.. యాడ్స్‌తో పాటు ఆర్టికల్‌కు ఇంత, రివ్యూకు ఇంత అని తీసుకోవడం కూడా పరిపాటి అయిపోయింది. ఓ వెబ్‌సైట్‌లో.. సినిమా యాడ్ డిస్ ప్లే కావాలంటే.. 60 వేలు అని, సినిమా ప్రమోషన్ ఆర్టికల్ రాస్తే 20 వేలు అని, ప్రీమియర్ షోలకు వెళ్లి.. స్పెషల్ రివ్యూ రాస్తే.. లక్ష దాకా సమర్పించుకోవాలని చెబుతున్నారు నిర్మాతలు. సోషల్ మీడియాలో సినిమా రివ్యూ పోస్ట్ చేసేందుకు కూడా 25 వేలు తీసుకుంటున్నారట. ఫస్ట్ హాఫ్ రివ్యూకు 20 వేలు, సెకండాఫ్ రివ్యూ కాస్త ఆలస్యంగా ఇచ్చేందుకు 30 వేలు ఇస్తున్నారట. ఇవన్నీ కాకుండా.. ఆ వెబ్‌సైట్ యాజమాన్యానికి.. సినిమా నిర్మాత లక్ష రూపాయల కవర్ పంపించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అయితే.. ప్రొడ్యూసర్లు కూడా ఈ ట్రెండ్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. రివ్యూలు చెప్పేవాళ్లు, రాసేవాళ్లు డిమాండ్ చేసినంత డబ్బులు ఇస్తున్నారు.

మూడు రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలనే ఆలోచన

ప్రతి ప్రొడ్యూసర్ తన సినిమా జనాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో.. సొంతంగా ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. దీనిని అదునుగా చేసుకొని.. ప్రమోషన్ల పేరిట.. పీఆర్ టీమ్‌లు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తున్నాయనే చర్చ ఉంది. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఏమీ ఆలోచించడం లేదు. సొంతంగా నిర్ణయం తీసుకొని.. లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ.. రిజల్ట్ చూశాక దెబ్బ గట్టిగా పడుతోంది. దాంతో.. ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఇండస్ట్రీలోని నిర్మాతలంతా.. ఒకే తాటి మీదకు వచ్చి.. ఓ నిర్ణయం తీసుకుంటే.. రివ్యూయర్లను కట్టడి చేయొచ్చంటున్నారు. గతంలో.. 3 రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలని.. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించినప్పటికీ.. అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాంతో.. కోట్లు ఖర్చు పెట్టి.. ఏళ్లు కష్టపడి ఓ సినిమా తీస్తే.. 3 గంటల సినిమా చూసి.. 3 నిమిషాల్లో రివ్యూ రాసేసి.. సినిమాను చంపేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పోనీ.. ఈ రివ్యూ రాసేవాళ్లకేమైనా.. సినిమా తీసేంత టాలెంట్ ఉంటుందా? అంటే అదీ లేదు. కేవలం.. తన అభిప్రాయాన్ని.. ప్రేక్షకుల అభిప్రాయంగా మార్చి చెప్పి.. సినిమాల కలెక్షన్లను తగ్గిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఓ వైపు పైరసీ వెబ్ సైట్లు సవాళ్లు విసురుతున్న క్రమంలో.. మరోవైపు వెబ్ సైట్లు కూడా నిర్మాతలకు తలనొప్పిగా మారాయ్.

ఎన్ని నెగటివ్ రివ్యూలు ఇచ్చినా.. సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ ప్రచారం చేసినా.. కంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వరూ ఆపలేరు. కంటెంట్ లేని సినిమాని.. ఏం చేసినా లేపలేరు. ఇదే.. వాస్తవం. సినిమా ఇండస్ట్రీలో.. కంటెంట్ మాత్రమే కింగ్. దానిని.. నమ్మితే చాలు. అయినా.. మౌత్ టాక్‌ని మించిన రివ్యూ మరొకటి లేదు. ఇది.. ఎవడో, ఎక్కడో కూర్చొని డిసైడ్ చేసేది కాదు. ఆడియెన్స్.. ఒరిజినల్ ఫీలింగ్ ఇది. ప్రేక్షకులకు గనక సినిమా నచ్చితే.. కచ్చితంగా ఆదరిస్తారు. ఊహించిన దానికంటే.. ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇది.. ఎన్నోసార్లు రుజువైంది. ఇక ముందు కూడా అదే జరుగుతుందని బలంగా చెబుతున్నారు.

Story by Anup, Big Tv

Related News

America Vs Russia: వలపు వల.. అమెరికా విలవిల, టెక్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్లన్నీ బయటకు.. ఇది ఎవరి పని?

JC Prabhakar Reddy: తాడిపత్రిలో టెన్షన్.. జేసీపై ఎస్పీ ప్లాన్ ఏంటి?

Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి షాక్.. హైకమాండ్ ప్లాన్ ఏంటి?

Bhimavaram: ఆర్ఆర్ఆర్‌పై జనసేన ఆగ్రహం.. అంత తొందర ఎందుకో?

Jubilee Hills Bypoll: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి బడా నేతలు, జనాలను మెప్పించేది ఎవరో?

Bihar Elections: గెలుపు కోసం ఆరాటం.. వరాల జల్లు కురిపిస్తోన్న రాజకీయ పార్టీలు, బీహార్ ప్రజల తీర్పు ఏమిటో?

Tuni Girl Incidnet: సొంత బంధువులే.. కామ పిశాచులై..

Big Stories

×