YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 4న మొంథా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జగన్ పర్యటన కొనసాగుతుంది. తుపాను కారణంగా తీవ్రంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావంగా ఈ పర్యటన చేస్తున్నారని వైసీపీ తెలిపింది. పెడన, మచిలీపట్నంలో రైతులను ఆయన పరామర్శించనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
“ఇటీవల మొంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, గాలులకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం కారణంగా రైతులు కుదేలైపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన, అనేక కార్యక్రమాలు, పథకాలను రద్దు చేశారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలను చేకూర్చారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడచిన 18 నెలల్లో 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల రూపంలో రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదు. దాదాపు రూ.600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని పెండింగ్ లో పెట్టారు. ఆర్బీకేలను, ఈ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు” అని వైసీపీ విమర్శించింది.
Also Read: Vegetables Rates: మొంథా తుపాను ఎఫెక్ట్.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. వినియోగదారుల జేబుకు చిల్లు
కూటమి ప్రభుత్వం నుంచి రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన, కార్యాచరణ రాలేదని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి తద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు వైసీపీ నేతలు పేర్ని నాని, తలశిల రఘురాం వెల్లడించారు.