Google In Vizag: గూగుల్.. వైజాగ్.. ఏఐ హబ్.. ఇప్పుడివే పదాలు ట్రెండింగ్. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో వైజాగ్‌లో ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయబోతుంది గూగుల్. అంతేకాదు ఓ డాటా సెంటర్.. అది కూడా గిగావాట్ సామర్థ్యంతో. మరి గూగుల్ ఎంట్రీతో ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కేరాఫ్‌గా వైజాగ్ మారబోతుందా? గూగుల్ డాటా సెంటర్ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందా? వైజాగ్ హబ్ గ్లోబల్ కనెక్టివిటీకి గేట్ వే కాబోతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరి నిజంగానే వైజాగ్‌లో ఏర్పాటయ్యే AI హబ్‌తో మారబోయేదేంటి? హబ్‌పై విమర్శలేంటి? వాటికి సమాధానాలేంటి?
వైజాగ్‌లో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడితో ఇండియాలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు గిగావాట్ సామర్థ్యమున్న డాటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇది నిజంగా అంత సింపుల్‌గా చెప్పే విషయం కాదు. ఎందుకంటే గూగుల్ కంపెనీ అమెరికా వెలుపల ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి ఇలాంటి సెంటర్‌లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
కాసేపు పెట్టుబడి, ఉద్యోగాల విషయాన్ని పక్కన పెడదాం. అసలు గూగుల్ ఈ ఏర్పాటు కోసం వైజాగ్‌ను సెలెక్ట్ చేసుకోవడం వెనక కూడా ఓ రీజన్ ఉంది. గూగుల్ సబ్ సీ కేబుల్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌లపై ఫోకస్ చేసింది. ఇప్పుడు గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త సబ్ సీ కేబుల్ వ్యవస్థను వైజాగ్ డేటా సెంటర్‌కు కనెక్ట్ చేయనున్నారు. సో… వరల్డ్ డేటా నెట్‌వర్క్‌కు ఇది డైరెక్ట్ లింక్ ఏర్పాటు చేయనుంది. వైజాగ్ నుంచి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా సహా మరో 12 దేశాలకు సబ్ సీ కేబుల్ లింక్ కనెక్ట్ అవుతుంది.
ఇండియాలో సబ్ సీ కెబుల్స్ నెట్‌వర్క్ ఇప్పటి వరకు ముంబై, చెన్నైకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు వైజాగ్ కూడా ఓ గేట్‌వేగా మారింది. ఇప్పుడు గూగుల్ ఏర్పాటు చేసే ఒక గిగావాట్ డాటా సెంటర్‌లో ప్రాసెస్ అయిన డాటా మొత్తం ఈ సబ్ సీ కేబుల్ ద్వారానే ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది.
ఇక సెకండ్ ఏఐ హబ్.. ప్రస్తుతం నడుస్తున్నది ఏఐ యుగం. ఈ ఏఐ పర్‌ఫెక్ట్‌గా ఫంక్షన్ అవ్వాలంటే ఇందులో మరింత టెక్నాలజీ రావాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్ కనెక్టివిటీ, క్లౌడ్ సేవలు, జెమిని వంటి AI మోడల్స్‌ను డెవలప్ చేసేందుకు ఇప్పుడు వైజాగ్ ఏఐ హబ్ కేరాఫ్ కానుంది. ఎందుకంటే ఈ డాటా సెంటర్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి అవసరమైన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్.. సింపుల్‌గా చెప్పాలంటే భారీ కంప్యూటింగ్ శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పుడు వైజాగ్‌లో ఇలాంటి డాటా సెంటర్‌నే ఏర్పాటు చేస్తోంది గూగుల్.
ఈ TPUలు ఇండియా ఏఐలో కీ రోల్ ప్లే చేయడం పక్కా చెప్పాల్సిందే. అంతేకాదు వీటిని బేస్ చేసుకొని ఎడ్జ్ డాటా సెంటర్‌గా కూడా పనిచేస్తుంది ఈ హబ్. సో.. గూగుల్ ఓ ఏఐ హబ్, డాటా సెంటర్, సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఇలా మూడింటిని ఏర్పాటు చేస్తోంది. దీని కోసం 15 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. వీటన్నింటిని కోసం వైజాగ్‌ను చూస్ చేసుకుంది.
ఇప్పుడు డాటా సెంటర్ విషయానికి వద్దాం.. ఒక గిగావాట్ సామర్థ్యమున్న డాటా సెంటర్ అంటే చాలా మందికి ఇంకా సరిగా అర్థం కాలేదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ డాటా సెంటర్ ఒక వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగించుకునే డాటా సెంటర్ అని అర్థం. అంటే ఇంత భారీ స్థాయిలో విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది అంటే.. లక్షల సంఖ్యలో సర్వర్‌లు, స్టోరేజ్ సెంటర్లు, నెట్‌వర్కింగ్ పరికరాలు ఉంటాయని అర్థం. ఇక్కడ ఒక గిగావాట్ అనేది డాటా సెంటర్ ఎంత పెద్దది అని సూచించడానికి ఉపయోగిస్తున్నాం. ఈ డాటా సెంటర్ వినియోగంలోకి వస్తే.. ఒకేసారి బిలియన్ల మంది కస్టమర్లు డాటా, అప్లికేషన్‌లను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంటుంది.
ప్రస్తుతం ఇండియాలో 1.4 గిగావాట్ల డాటా సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క వైజాగ్‌లోనే ఒక గిగావాట్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతుంది గూగుల్. అంటే ప్రస్తుతం ఉన్న డాటా సెంటర్‌లకు ఈక్వల్‌గా వైజాగ్ డాటా సెంటర్ ఉండబోతుంది. అంతేకాదు 2030 నాటికి ఇండియాలో నాలుగు గిగావాట్ల డాటా సెంటర్‌లు ఏర్పాటవుతాయనేది ఓ అంచనా. సో.. అలా చూసుకున్న ఒక్క వైజాగ్ షేరే అందులో 25 శాతం ఉంటుంది. మరి గిగావాట్ విద్యుత్ అంటే చిన్న విషయం కాదు. కానీ ఇక్కడ గూగుల్ ఓ విషయం క్లారిటీ ఇచ్చింది. ఇందులో 80 శాతం క్లీన్ ఎనర్జీని ఉపయోగిస్తారు.
మరి ఈ క్లీన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. కానీ గూగుల్ దీని కోసం సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడమో.. లేదా ఏర్పాటు చేసేందుకు తన పార్ట్‌నర్స్‌ను ప్రోత్సహించడమో జరుగుతోంది. ఇది ఇండియాలో ఓ సరికొత్త రెవల్యూషన్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెన్ కంప్యూట్ ప్రాజెక్ట్ టెక్నాలజీతో ఈ డాటా సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తారు. ఇండియాలో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి.
డాటా సెంటర్‌లు అంటేనే చాలా విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తుండటంతో.. విద్యుత్ వినియోగం 20 శాతం తక్కువగానే ఉంటుంది. అంతేకాదు గూగుల్ క్లీన్ ఎనర్జీ పాలసీని కూడా నమ్మవచ్చు కాబట్టి.. ఏపీ ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉండే అవకాశం లేనట్టే.
అంతా బాగానే ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ కారణంగా వచ్చే ఉద్యోగాలపైనే ఇప్పుడు అనేక విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్టుగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయా? విపక్షం చెబుతున్నట్టు అసలు ఉద్యోగాలే రావా? ఈ డాటా సెంటర్ల కారణంగా నిజంగా తీవ్ర నష్టాలు ఉన్నాయా?
ఎన్నో ప్రశ్నలు.. సందేహాలు..
ప్రశంసలు.. విమర్శలు.. ఉద్యోగాలు వస్తాయని కొందరు.. రావని మరికొందరు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మాట. డాటా సెంటర్లు వద్దు బాబోయి అని దేశాలు మొత్తుకుంటుంటే మనం ఎందుకు రెడ్ కార్పెట్ పరచాలనేది కొందరి ప్రశ్న. రాబోయే సరికొత్త టెక్ యుగానికి మనమే నాంది పలుకుతున్నామనేది దానికి కౌంటర్‌గా మరికొందరి మాట. ఇలా ఎవరి ప్రశ్నలు వారు సంధిస్తున్నారు.. ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసే చాలా విషయాలు తెలిశాయి.
ఎప్పుడైతే డాటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం జరిగిందో.. అప్పటి నుంచి ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు 22 వేల కోట్ల రాయితీని ఇస్తోంది. ఇదే ఇప్పుడు అనేక విమర్శలకు కారణమైంది. అసలు ఎక్కువగా రాని ఉద్యోగాలకు ఇంత సబ్సిడీలు ఇచ్చి వైజాగ్‌కు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ప్రపంచలోని అభివృద్ధి చెందిన దేశాలు డాటా సెంటర్లను వద్దనుకుంటుంటే.. మనం ఎందుకు తీసుకొచ్చిన నెత్తి మీద పెట్టుకోవాలి? అనేవి ఇప్పుడు విపక్షాలు ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు.
కానీ ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానం మాత్రం మరోలా ఉంది. ఈ విమర్శలను తాము పట్టించుకోమంటున్నారు. ఈ పెట్టుబడితో ఈ ప్రాంత స్వరూపం మారిపోతుందనేది వారు చెబుతున్న మాట. ఈ ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం అనేక వాదనలు ఉన్నాయి. కొంతమంది లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి.. మరికొంత మంది ఆ సంఖ్య వందల్లో ఉంటుంది అంటూ డైలాగ్ వార్ మొదలు పెట్టారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఒక గిగావాట్ సామర్థ్యమున్న డాటా సెంటర్ అంటే చాలా పెద్దది… దీనిని నిర్మించే సమయంలో చాలా మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది అనేది వాస్తవం. ఇది తాత్కాలికమే కానీ.. ఉపాధి దొరకడం ఖాయం. ఇక నిర్మాణం పూర్తైన తర్వాత కూడా చాలా మందికి ఉపాధి కన్‌ఫామ్.
ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఏర్పాటయ్యే సెంటర్‌కు సెక్యూరిటీ గార్డు నుంచి మొదలు పెడితే మేనేజర్ లెవల్ వరకు వేలాది మందికి ఉపాధి ఖాయం. అంతేకాదు గిగావాట్ సామర్థ్యమున్న సెంటర్ కాబట్టి.. భారీగా మెషనరీ ఉంటుంది. వీటి మెయింటనెన్స్‌ను చూసేందుకు ఉద్యోగులు అవసరం అవతారు. అయితే ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అందులో స్థానికుల్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇదే ఇప్పుడు విమర్శలు చేసే వారికి అస్త్రంగా మారుతుంది.
బట్ ఈ పెట్టుబడిని మాత్రం చాలా గొప్పగానే చూస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే.. ఇది కేవలం డాటా సెంటర్ మాత్రమే కాదు.. సబ్ సీ కెబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా అని.. అంటే ఈ కేబుల్ మెయింటనెన్స్ కూడా ఉంటుంది. అదే సమయంలో ఏఐ హబ్ కాబట్టి.. చాలా మంది టెక్ నిపుణులు వైజాగ్‌లో ల్యాండ్ కావాల్సిందే అంటున్నారు.
గూగుల్ లాంటి సంస్థ వైజాగ్‌కు వచ్చి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమే. కానీ ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గూగుల్ బ్రాండ్ ఇప్పుడు వైజాగ్ డెవలప్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారనుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. హాస్పిటాలిటీ, టూరిజం పరుగులు పెడుతుందని.. అనేక కంపెనీలు క్యూ కడుతాయని చెబుతున్నారు.. ఏ కంపెనీలు వస్తాయి? అనే విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు.. అదేలాగో చెబితే గూగుల్ పెట్టుబడిని విమర్శించే వారికి కూడా సమాధానం దొరుకుతుంది.
ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. వైజాగ్‌లో గూగుల్ పెట్టుబడి అనేది కేవలం ఈ డాటా సెంటర్‌కు మాత్రమే సంబంధించినది కాదు. ఇప్పటికే వైజాగ్ పేరు వరల్డ్ వైడ్‌గా ప్రమోట్ అవుతుంది. ఈ ప్రమోషన్ అనేక పెట్టుబడులను వైజాగ్ రప్పించే ఓ అవకాశం ఇప్పుడు ఏపీ చేతిలో ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ పని ప్రారంభించినట్టే కనిపిస్తోంది.
Story By Vamshi, Big Tv