Rain Alert: నిన్న రాత్రి రాజాదాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కూకట్ పల్లి, పటాన్ చెరు, లింగం పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, ప్రగతి నగర్, నిజాంపేట, మియాపూర్, మూసాపేట, చందానగర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్ పల్లి, బొల్లారం, తిరుమలగిరి, మారేడ్ పల్లి, మెట్టుగూడ, ఉప్పల్, మల్కాజ్ గిరి, ఎల్‌బి నగర్, చార్మినార్ వీటితో పాటు హైదరాబాద్ అంతటా ఉరుములు, మెరుపులతో కుంభవృష్ఠి సృష్టించింది. రోడ్లన్నీ వాగులు, వంకలై పారాయి. ఈ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యింది. అయితే ఈ వర్షాలు ఇక్కడితో ఆగిపోలేదు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్..
తెలంగాణలో వర్షాలు అస్సలు ఆగడం లేదు.. వర్షాలు పోయాయి అనుకుంటే మళ్లీ వర్షాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆదివారం భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా తెలంగాణ పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసాయి. సోమవారం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే సంగారెడ్డి, యాదాద్రి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సూర్యపేట, భువనగిరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగత జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురస్తాయని తెలిపారు. ఎవ్వరు కూడా ప్రజలు వర్షం వచ్చే సమయంలో బయటకు రాకుడదనీ.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద లేదా బహిరం ప్రదేశాల్లో నిలబడకూడదని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
Also Read: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల బంగారం ఎంతంటే..?
ఏపీలో వాతావరణం ఇలా..
ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విదర్భ, మరట్వాడ ప్రాంతాల సమీపంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వాయువ్య దిశలో గాలులు వీస్తుండటంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది. రేపు మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తాలో ఇప్పటికే పలు చోట్ల సాధారణ వర్షాలు పడుతుండగా.., రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అటు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.