అభివృద్ధి గురించి ప్రశ్నించినా…అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించినా… పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వీనిరెడ్డి ఒకటే డైలాగ్ వదులుతున్నారట. మంచి చెప్పినా….ముందు జాగ్రత్తలు సూచించినా అదే పాత డైలాగ్ తిరగేస్తున్నారట. ఆ ఎమ్మెల్యే తీరుతో…ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట నియోజకవర్గ ఓటర్లు. ఇంతకీ పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?
పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ గరం గరంగా నడుస్తున్నాయి. అధికార… ప్రతిపక్ష పార్టీల మధ్య జరగాల్సిన పోటాపోటీ రాజకీయాలు స్వంత పార్టీలోనే జరుగుతున్నాయి. అధికార హస్తం పార్టీ నేతలు రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారట. దీంతో నియోజకవర్గ అభివృద్ధి మాట పట్టించుకునేవారు లేరని స్థానికులు అసంతృప్తికి లోనవుతున్నారట. ఎర్రబెల్లిని ఓడించి యశస్వినీ రెడ్డికి పట్టం కట్టిన పాలకుర్తి ప్రజలు సంక్షేమం, అభివృద్ధిలో నియోజకవర్గం దూసుకుపోతుందని భావించారట. ఝాన్సీ రెడ్డి, యశస్వినీ రెడ్డిలు రాజకీయాలకు కొత్త కావడంతో…. పార్టీలను పక్కనబెట్టి డెవలప్మెంట్ పైనే దృష్టి పెడతారని ఆశపడ్డారట. అయితే ఇప్పుడు తమ పరిస్తితి పెనం నుండి పొయ్యిలో పడినట్లు అయిందని ఆవేదన చెందుతున్నారట.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డి నియోజకవర్గాన్ని మోడల్ గా నిలుపుతామని ప్రజలకు ప్రామిస్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను సొంత నిధులు ఖర్చు పెట్టైనా పూర్తి చేస్తామని హామీల వర్షం గుప్పించారు. కానీ నెలల గడుస్తున్న కొద్దీ…మాటలు తప్ప, అభివృద్ధి బాటలు కనిపించట్లేదట. నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదని స్వంత పార్టీ నేతలే తమ ఎమ్మెల్యేపై మండిపడుతున్నారట. కొంతమంది నేతలు దైర్యం చేసి ప్రజలకిచ్చిన హామీల మాటేమిటని అడిగితే….పార్టీ నుండి వెలివేసి..మాతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్లే అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారట.
ప్రస్తుతం దేవరుప్పుల మండలంలో 5కోట్ల రూపాయల నిధులతో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. అయితే ప్రభుత్వ స్థలంలో అందరికీ అందుబాటులో ఉండే చోట నిర్మాణాలు చేయాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేవరుప్పుల శివారులోని మనుపాడ్ గుట్టలను తొలగించి గోదాంల నిర్మాణం చేయాలని కొందరు నేతలు సూచిస్తున్నారు. అయితే పర్యావరణానికి హాని జరిగేలా…గుట్టలను తొలగిస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ నాయకుడు పెద్ది కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి మరో సినిమా డైలాగ్ అందుకున్నారట. గ్రామస్తుల నిర్ణయం చెప్తే…ఈ డైలాగులు ఏంటని కాంగ్రెస్ శ్రేణులే విస్తుపోయారట.
గత కొద్ది నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయాలని నిరసనలు జరుగుతున్నాయి. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూంలు పంపిణీ చేయాలని కొంతమంది హస్తం పార్టీ నేతలే పట్టుబడుతున్నారట. ఇలా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి మాట్లాడితే….తమతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్లే అంటూ తమ చుట్టూ ఉన్న నేతలకే వార్నింగ్స్ ఇస్తున్నారట ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి.
నియోజకవర్గంలోని గ్రామాలలో రోడ్ల పరిస్తితి అధ్వాన్నంగా మారి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఖమ్మం హైవే ప్రతిరోజూ ప్రమాదాలతో రక్తసిక్తంగా మారుతోంది. సమస్యలు చెప్పుకుంటే మళ్ళీ సినిమా డైలాగులు చెప్తారేమోనని సైలెంట్ గా బాధలు అనుభవిస్తున్నారట నియోజకవర్గ ప్రజలు.
రాజకీయాలకు అతీతంగా తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎర్రబెల్లిని ఓడిస్తే… అభివృద్ధి సంక్షేమం దేవుడెరుగు సమస్యలు చెప్పుకుంటే రీసౌండ్ లో డైలాగులు వినాల్సి వస్తుందని లోలోపలే మదన పడుతున్నారట పాలకుర్తి ప్రజలు. అభివృద్ధిలో దూసుకెళ్తామనుకున్న ఆశలన్నీ అడియాసలైనట్లేనని తలలు పట్టుకుంటున్నారట నాయకులు.
Story by Big Tv