Vizag Data Centers: విశాఖలో గూగుల్-అదానీ కనెక్ట్స్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లపై పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ఆందోళనలు, మరోవైపు న్యాయస్థానాల్లో పిటిషన్లు నేపథ్యంలో ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. డేటా సెంటర్లలో నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు అత్యాధునిక ఎయిర్ కూల్డ్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.
విశాఖలో గూగుల్-అదానీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లపై తెర వెనుక పెద్ద రచ్చ జరిగింది. డేటా సెంటర్ల వల్ల నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని, పర్యావరణానికి డ్యామేజ్ జరుగుతుందని, డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో జంతువులకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని సోషల్ మీడియా వేదికగా పర్యావరణ వేత్తలు గొంతుఎత్తారు. అంతేకాదు బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా ఓ జర్నలిస్టుని తీసుకొచ్చి రకరకాల స్టోరీలు ప్రచురించాయి. అంతేకాదు అంతర్జాతీయ మీడియాను విశాఖకు తీసుకొచ్చి స్టోరీలు చేయించాయి.
ఇదంతా జరుగుతుండగా న్యాయస్థానాల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. దీనిపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలో డేటా సెంటర్లలో నీటి వినియోగం తగ్గించేందుకు కీలక చర్యలు తీసుకుంటున్న గూగుల్-అదానీ కనెక్ట్ సంస్థ వెల్లడించాయి. డేటా సెంటర్లలో నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఎయిర్-కూల్డ్ కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ముడసర్లోవ, తర్లువాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న క్యాంపస్‌ల్లో కొత్త టెక్నాలజీ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది.
డేటా సెంటర్ల నిర్వహణ, కూలింగ్ వ్యవస్థలకు భారీగా మంచి నీరు అవసరం కానుంది. దీనికి భిన్నంగా ఎయిర్ కూలింగ్ కొత్త టెక్నాలజీని వినియోగం ద్వారా నీటి అవసరాన్ని దాదాపుగా తొలగించాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టులకు అన్నింటికి కలిపి మంచినీటి వినియోగం ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ పరిమాణం కంటే తక్కువగా ఉంటుందని ఓ అంచనా. అందులోని 80 శాతం నీటిని ఉద్యోగుల సౌకర్యాలు, వంట గదులు, పచ్చదనం పెంపకం వంటి అవసరాలకు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులు ముడసర్లోవ రిజర్వాయర్, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉన్నాయి.
దీనివల్ల నీటి వనరులపై ప్రభావం చూపుతాయని పర్యావరణ వేత్తలు ఆందోళనలు చేశారు. గృహ అవసరాలకు వినియోగించే నీటి వనరులపై ఆధారపడకుండా ఇండస్ట్రియల్ వాటర్ కనెక్షన్ల ద్వారా నీటిని సేకరించనున్నట్లు స్పష్టం చేసింది. జీరో-డిశ్చార్జ్ విధానాన్ని పాటిస్తూ ప్రాజెక్టులో వెలువడే మురుగునీటిని ఆన్‌సైట్ ప్లాంట్‌లో శుద్ధి చేసి ఇరిగేషన్ అవసరాలకు తిరిగి వినియోగించనున్నాయి. శుద్ధి చేసిన నీటిని కూడా ముడసర్లోవ రిజర్వాయర్‌లోకి వదిలే ప్రసక్తే లేదని హామీ ఇచ్చాయి. దీనివల్ల ముడసర్లోవ రిజర్వాయర్, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంపై ప్రభావం తగ్గించడమే లక్ష్యంగా పేర్కొంది.
ALSO READ: భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి… మహిషాసురమర్ధిని దేవి రూపంలో అమ్మవారు దర్శనం
అదానీ ఎంటర్‌ప్రైజెస్-ఎడ్జ్ కనెక్ట్స్ సంస్థల జాయింట్ వెంచర్ అదానీ కనెక్ట్స్. గూగుల్‌తో కలిసి ఒక గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్లను అభివృద్ధి కోసం ఈ సంస్థ పని చేస్తోంది. ఈ ప్రాజెక్టులతోపాటు రిలయన్స్, ఎయిర్‌టెల్ వంటి సంస్థల కార్యకలాపాలతో విశాఖ దేశంలో ఓ ముఖ్యమైన డేటా సెంటర్, ఏఐ హబ్‌గా మారనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ భోగాపురం-పోలిపల్లి సమీపంలో ఓ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తోంది. భారతి ఎయిర్‌టెల్ రాంబిల్లిలో మెట్రోపాలిటన్ ఫైబర్ నెట్‌వర్క్‌లు, సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. డేటా సెంటర్లు అనేవి డిజిటల్ సమాచారాన్ని నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, ప్రసారం చేయడానికి ఉపయోగించే కంప్యూటింగ్ పరికరాలను కలిగిన మౌలిక సదుపాయాలు ఉంటాయి. వాటిని కూలింగ్ చేయడానికి నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలలో స్థానిక నీటి వనరులపై ఒత్తిడిని కలిగించగలవని సదరు సంస్థ వెల్లడించింది.