Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలో స్థానిక రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పక్షం, జిల్లా యంత్రాంగం వైఖరిపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును కూడా జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా పక్కన పెట్టేసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేషన్ల తిరస్కరణ!
జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదంటూ అధికారులు వాస్తవాలను తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇచ్చారని కాకాణి ఆరోపించారు. రిటర్నింగ్ అధికారులు తమ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరించి, పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసే తాకతు లేకనే, వైఎస్సార్‌సీపీకి చెందిన బలమైన అభ్యర్థుల నామినేషన్లను కుట్రపూరితంగా తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, టీడీపీ నేతలే స్వయంగా వైఎస్సార్‌సీపీ పేరుతో ఫేక్ నామినేషన్లు వేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పోలీసులు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ధ్వజమెత్తారు. నిజాయితీగా పని చేయాలనుకునే అధికారులను టీడీపీ నేతలు, పోలీసులు కలిసి బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లలోకి అర్ధరాత్రి దొంగతనంగా చొరబడి గంజాయి కేసులు బనాయించేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబుకి నీతి నిజాయితీ లేదు
చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో ప్రారంభమైందని, ఇప్పుడు ఆయన ప్రజల వెన్ను విరిచేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు నుంచి గట్టి మొట్టికాయలు పడిన తర్వాత కూడా చంద్రబాబుకు నిజాయితీ, నీతి ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని కాకాణి డిమాండ్ చేశారు. ఇన్ని అడ్డంకులు, బెదిరింపులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రాణాలకు తెగించి నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు.
Also Read: ‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్