RK Roja: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఛైర్మన్ పీఠం పోరు.. చివరికి ఊహించని మలుపు తిరిగింది. ప్రత్యర్థి నామినేషన్ చెల్లకుండా పోవడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్నిక నల్లేరుపై నడకలా మారి ఏకగ్రీవానికి దారితీసింది. అయితే దీనివెనుక అధికార పక్షం కుట్ర ఉందంటూ వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నామినేషన్ తిరస్కరణతో ఊహించని మలుపు
నగరి మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానానికి జరిగిన ఈ ఎన్నికలో వైసీపీ, టీడీపీలు పోటీపడ్డాయి. అయితే నామినేషన్ల పరిశీలన సమయంలో వైసీపీ అభ్యర్థి దాఖలు చేసిన పత్రాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ అధికారులు దానిని తిరస్కరించారు. దీంతో రింగులోకి మిగిలిన ఏకైక అభ్యర్థి, టీడీపీకి చెందిన ఈ.ఎన్.శ్రీనివాసన్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
అధికారుల తీరుపై మండిపడ్డ రోజా
ఈ పరిణామంపై నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏకగ్రీవం ప్రక్రియపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. రూల్ బుక్‌ను పక్కనబెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.
రేపే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
అధికారుల ఏకపక్ష నిర్ణయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు రోజా స్పష్టం చేశారు. రేపే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికే తాము కోర్టుకు వెళ్తున్నామని, న్యాయస్థానంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Also Read: సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ