Kolamuru Village: రాజమండ్రి రూరల్ మండలంలో మొత్తం 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వీటిలో 9 గ్రామ పంచాయతీలను రాజమండ్రి కార్పొరేషన్ లో విలీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఒక్క కోలమూరు పంచాయతీని మాత్రం ఒంటరిని చేశారు. 9 గ్రామాలను విలీనం చేసి మండల పరిషత్,జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. 23వేల మంది ఓటర్లు ఉన్న కోలమూరు లో 18 వార్డులు ఉన్నాయి. అధికారుల విలీన నిర్ణయంతో ఇపుడు కోలమూరు నుంచే ఎంపీపీ,వైస్ ఎంపీపీ,జెడ్పీటీసీ పదవులకు అభ్యర్ధులు ఎన్నిక కానున్నారు. గ్రామంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటినుంచే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరుగుతుంది. అంతే కాదు జెడ్పీటీసీని కూడా కోలమూరునుంచే ఎన్నుకోవలసిన పరిస్థితి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఇటువంటి విచిత్ర పరిస్థితి ఇంకెక్కడా లేదు.
జెడ్పీటీసీ పదవిని ఎస్సీ జనరల్ కేటగిరీకి, ఎంపీపీ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేశారు. గ్రేటర్ రాజమహేంద్ర వరం ముసుగులో నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అనాలోచితంగా విలీనం చేయడం పట్ల విలీన గ్రామాల ప్రజలతో పాటు రాజకీయ నేతలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలం మొత్తం మీద జరగాల్సిన ఎన్నికలు ఒక్క గ్రామంలోనే జరిగేలా నిర్ణయం ఎలా తీసుకుంటారని వారు నిలదీస్తున్నారు.
వివిధ వర్గాల నుండి విమర్శలు వస్తోన్నా అధికారులు మాత్రం ప్రభుత్వ గెజిట్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. అధికారుల నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష చేసి నిర్ణయాన్ని రివర్స్ చేయాలని వారు కోరుతున్నారు.
Also read: తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల డేటా విడుదల.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!